నవంబర్-30వరకు అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ పొడిగింపు

Centre extends Unlock-5 guidelines కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో సడలిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ లాక్ 5.0 దశ అక్టోబర్-31న ముగియనున్న నేపథ్యంలో ఈసారి నిబంధనల్లో మరిన్ని మార్పులు చేస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే,అన్‌లాక్ 5.0 గైడ్ లైన్స్ ని నవబంర్-30వరకు పొడిగిస్తూ ఇవాళ(అక్టోబర్-27,2020)కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్‌లాక్ 5.0 లో భాగంగా ప్రకటించిన సడలింపులు..నవంబర్ 30 వరకు వర్తిస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది.



లాక్‌డౌన్ విషయంలో సడలింపులు ఇస్తున్న కేంద్రం.. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతోంది. గత వారం ప్రధాని మోడీ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు సందేశం ఇచ్చారు. లాక్‌డౌన్ పోవడం అంటే కరోనా పోయినట్టు కాదని, కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరక అజాగ్రత్త వద్దని సూచించారు. పండగల సమయంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తత అవసరమని సూచించారు.



కాగా, సెప్టెంబర్-30న అన్‌లాక్ 5 సడలింపులను ప్రకటించిన కేంద్రం… అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే సమయంలో ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పింది. అయితే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థుల విషయంలో మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.



విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యాసంస్థలు అనుమతి తీసుకోవాలని చెప్పింది. విద్యార్థుల హాజరు విషయంలో పట్టుపట్టకూడదని కండిషన్ పెట్టింది. ఇదే సమయంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు