Modi Reacts on KCR Injury: చాలా బాధపడ్డాను.. కేసీఆర్ జారి పడడంపై మోదీ స్పందన

తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాత్రి ఫాంహౌజ్ లో జారి పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడ్డానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని అన్నారు. ఈ విషయమై ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తున్నాను’’ అని పోస్ట్ చేశారు.


తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయమై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో నిపుణుల సంరక్షణలో ఉన్నారు. ప్రజల మద్దతు, శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో నాన్న త్వరలో పూర్తిగా కోలుకోనున్నారు. అందరి ప్రేమకు కృతజ్ఞతలు’’ అని తన ఎక్స్ ఖాతాలో కవిత ట్వీట్ చేశారు.


ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్ కి వెళ్లిపోయారు. ప్రభుత్వ వాహనాలు వదిలేసి, ఎలాంటి ఆర్భాటం లేకుండా తన సొంత కారులో వెళ్లారు. గత మూడు రోజులుగా ఆయన ప్రజలను కలుస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ కి వచ్చి కేసీఆర్ ని కలుస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా క్యూ కడుతున్నారు.