ఢిల్లీలో కరోనా విజృంభణ…కేంద్రం 12 పాయింట్ ఫ్లాన్

More ICU Beds, Increased Testing: Centre’s 12-Point Covid Plan For Delhi ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో ఆదివారం ఉన్నతస్థాయి అత్యవసర సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష వర్ధన్‌, ఢిల్లీ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా నియంత్రణకు తక్షణం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.



12 పాయింట్ల ప్రణాళికతో ఢిల్లీలో కరోనాని హ్యాండిల్ చేయాలని ఈ మీటింగ్ లో నిర్ణయించామని సమావేశం అనంతరం కేజ్రీవాల్ తెలిపారు. ఈ 12 పాయింట్ల ఫ్లాన్ లో ఐసీయూ బెడ్స్,ఆక్సిజన్ సిలిండర్లు,ఎక్కువ మెడికల్ స్టాఫ్ వంటివి ఉన్నాయన్నారు. అంతేకాకుండా,ఢిల్లీలో కరోనావైరస్ టెస్టింగ్ సామర్ధ్యం పెంచడం,హోమ్ ఐసొలేషన్ లో ఉన్నవారిని మానిటరింగ్ చేయడం వంటివి కూడా ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం నిర్వహించిన అమిత్‌ షాకు కేజ్రీవాల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆరోగ్యం కోసం ఈ భేటీ ఎంతో అవసరమని అన్నారు.



అక్టోబర్-20నుంచి ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని,కానీ ఐసీయూ బెడ్స్ తగినన్ని లేవని కేజ్రీవాల్ అన్నారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవో సెంటర్ లోని 750 ఐసీయూ పడకలను కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చింద కేజ్రీవాల్ చెప్పారు. దేశ రాజధానిలో రోజు వారీ కరోనా టెస్టుల సంఖ్య ప్రస్తుతమున్న 60వేల నుంచి 1 లక్షకు పైగా పెంచుతామని కేజ్రీవాల్ తెలిపారు.



మరోవైపు, ఢిల్లీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4.85లక్షలకు, పాజిటివిటీ రేటు 15.33శాతానికి పెరిగింది. గడిచిన 24గంటల్లో మహమ్మారి కారణంగా 95 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 7,614కు పెరిగిందని అధికారులు తెలిపారు. ఇక, రోజువారీ కరోనా పరీక్షలను 60 వేల నుంచి లక్షకుపైగా పెంచుతామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం నుంచి కరోనా కేసుల నమోదు మరింత ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తున్నది.