Spurious Liquor : ప్రభుత్వం సంచలన నిర్ణయం..కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్ష

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Spurious Liquor మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎవరైనా కల్తీ మద్యం కారణంగా మరణించినట్లయితే.. కల్తీ మద్యం విక్రయించిన వారికి ఉరిశిక్ష లేదా గరిష్ఠంగా 10 సంవత్సరాల జీవితఖైదు విధించే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. అలాగే, జరిమానా మొత్తాన్ని కూడా గరిష్ఠంగా రూ.20 లక్షలకు పెంచారు. కాగా,ఇటీవల మందసౌర్ మరియు ఇండోర్‌లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం గమనార్హం.

ఇక,అక్రమ మద్యం అమ్మకాలను పట్టుకోవడానికి వచ్చిన ఎక్సైజ్ బృందం లేదా ఇతర దర్యాప్తు బృందంపై దాడి చేసిన సందర్భంలో మూడేళ్ల వరకు శిక్ష విధించనున్నారు. కల్తీ మద్యం అమ్మకాలను నిరోధించేందుకే ఈ కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. తొలిసారి కల్తీ మద్యం విక్రయిస్తూ దొరికిన వారికి జీవిత ఖైదు విధిస్తారని, రెండోసారి లేదా ఇదే నేరాన్ని పునరావృతం చేయడం వల్ల నిందితుడికి మరణశిక్ష విధించవచ్చని వారు వెల్లడించారు. ఇదే సమయంలో మద్యంలో కల్తీకి జరిమానా మొత్తాన్ని రూ.30,000 నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, గతంలో మద్యం కల్తీపై రూ.300 నుంచి రూ.2,000 వరకు జరిమానా ఉండేది.

ట్రెండింగ్ వార్తలు