Pahalgam attack: అవును నా సోదరుడు ముజాహిదీనే.. ఒప్పుకున్న మహిళ.. అతడు పాక్‌కు వెళ్లి వచ్చి..

థోకర్ 2018లో అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌కు చట్టబద్ధంగా వెళ్లాడు.

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో పాల్పడినట్టు భావిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్‌, ఆషిఫ్ షేక్‌ల ఇళ్లను సైన్యం ఐఈడీతో ధ్వంసం చేసింది. అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన థోకర్ పహల్గాం దాడిలో నిందితుడిగా ఉన్నాడు. మరో వ్యక్తి ఆషిఫ్ షేక్ ఈ కుట్రలో పాలుపంచుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో వారి ఇళ్లను కూల్చివేశారు.

Also Read: డెడ్‌లైన్‌లోపు మన దేశం నుంచి పాకిస్థానీయులు వెళ్లకపోతే జరిగేది ఇదే.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

ఉగ్రవాదిడికి పాల్పడ్డ తన సోదరుడు ముజాహిదీనేనని ఆదిల్ హుస్సేన్ థోకర్‌ సోదరి తెలిపింది. కూల్చివేసిన ఆ ఇంటి శిథిలాల దగ్గర ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “నా సోదరుల్లో ఒకరు జైలులో ఉన్నాడు. మరొక సోదరుడు ముజాహిదీన్. నాకు ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. నిన్న నేను మా అత్తమామల ఇంటి నుంచి ఇక్కడకు వచ్చాను.

నేను ఇక్కడి మా తల్లిదండ్రు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. పోలీసులు వారిని తీసుకెళ్లారు. నేను ఇక్కడికి చేరుకున్నాక కూడా భద్రతా దళాలు వచ్చారు. పొరుగువారి ఇంటికి వెళ్లాలని నాతో వారు అన్నారు. యూనిఫాం ధరించి ఉన్న ఒక వ్యక్తి ఇంటి పైన బాంబు వంటి వస్తువును ఉంచడాన్ని నేను చూశాను. ఆ తరువాత, ఇంటిని కూల్చివేశారు. మేము నిర్దోషులం. మా ఇంటిని ధ్వంసం చేశారు” అని చెప్పింది.

కాగా, దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల గురించి సమాచారం తెలిపితే రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. లష్కరే తాయిబాకి చెందిన ఈ ముగ్గురిలో హుస్సేన్‌ థోకర్‌ అనంత్‌నాగ్‌ వాసి. మిగతా ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన వారు.

థోకర్ 2018లో అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌కు చట్టబద్ధంగా వెళ్లాడు. అక్కడ ఉగ్రవాద శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జమ్మూకశ్మీర్‌కు అతడు రహస్యంగా తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నాడు.

కాగా, పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసే సంకల్పంతో ముందుకు సాగుతోంది. భారత్ కేవలం దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడమే కాకుండా, పాకిస్థాన్‌ను ఆర్థికంగా నష్టపరిచేలా సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.

పహల్గాం ఘటనలో నేరుగా పాల్గొన్న ఉగ్రవాదులను శిక్షించాలని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌పై నేరుగా ప్రతీకారం తీర్చుకునే మార్గంపై భారత్‌ ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సైనిక చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా, సమగ్రంగా వ్యవహరిస్తోంది.