Narendra Modi
Narendra Modi: బెంగాల్‌లో 5వ దశ ఎన్నికలకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. 45 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతోండగా.. బీజేపీ అగ్రనేతలు బెంగాల్‌లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ వర్ధమాన్ నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ సందర్బంగా తృణమూల్ నేతలతోపాటు మమతపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో శోభా మజుందార్‌ను కోల్పోవాల్సి వచ్చిందని, ఆమెను తృణమూల్ గూండాలు క్రూరంగా కొట్టారని, ఆ విషయాన్ని తాము ఎప్పటికీ మరిచిపోమని అన్నారు. ఎన్నికల విధులకు వచ్చిన ఓ నిజాయితీగల పోలీస్ అధికారిని కొట్టి చంపారని, కొడుకు మరణవార్త విని తల్లి మృతి చెందిందని ఆమె సీఎంకు తల్లి కాదా? అని మోడీ సూటిగా ప్రశ్నించారు.
మమత పరిపాలనలో బెంగాల్‌లో అరాచకాలు పెరిగిపోయాయని, వందలమంది బీజేపీ కార్యకర్తలను తృణమూల్ గుండాలు పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత బెంగాల్ ప్రజలను పదేళ్లు పాలించారని.. పాలన పేరుతో మమత తీవ్ర గందరగోళం సృష్టించారని మోడీ విమర్శించారు.
మా, మాటీ, మానూష్ నినాదానికి మోడీ కొత్త అర్ధం చెప్పారు. మా అంటే హింసించడమని, మాటీ అంటే దోచుకోవడమని, మనుష్ అంటే రక్తపాతం అని అర్థమన్నారు. ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో తాము 100 సీట్లు గెలుస్తామని తెలిపారు. నందిగ్రామ్‌లో మమత క్లీన్‌బోల్డ్ అయ్యారని, తన ప్లేస్‌లో కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు.
రానురాను.. మమతలో కోపం పెరుగుతోందని దీనికి కారణం నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్‌ను ప్రజలు పూర్తిగా తుడిచిపెట్టేశారని అన్నారు. ఓటమికి బయపడి మమత మరో స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని మోడీ చెప్పుకొచ్చారు.