ఒడిశాలో 17 ఎంపీ సీట్లు, 75 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం: అమిత్ షా

జూన్ 4 తర్వాత న‌వీన్‌బాబు ముఖ్యమంత్రిగా ఉండబోరు.. ఆయన మాజీ సీఎం అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.

Naveen Patnaik to become former CM of Odisha after June 4 says Amit Shah

Amit Shah in Odisha: ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జూన్ 4 తర్వాత మాజీ సీఎం అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ప్రసుత్తం జరుగుతున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 75 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని కాషాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చాంద్‌బాలీలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒడిశాలో 17 ఎంపీ స్థానాలను కూడా గెలవబోతున్నామని అన్నారు.

”జూన్ 4 తర్వాత న‌వీన్‌బాబు ముఖ్యమంత్రిగా ఉండబోరు. ఆయన మాజీ సీఎం అవుతారు. ఒడిశా ఎన్నికల్లో బీజేపీ 17 ఎంపీ సీట్లు, 75 అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఒడియాలో అనర్గళంగా మాట్లాడగలరని.. రాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని షా వెల్లడించారు. తమిళబాబు తెర వెనుక నుంచి ఒడిశా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, కమలం గుర్తుకు ఓటు వేసి ఆఫీసర్ స్థానంలో ప్రజాసేవకుడి పాలన తెచ్చుకోవాల”ని ఓటర్లకు పిలుపునిచ్చారు. నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడైన VK పాండియన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జాజ్‌పూర్‌లో జరిగిన మరో ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. ఉపాధి లేక ఒడిశా నుంచి ప్రజలు ఇతర రాష్ట్రాలను వలసపోతున్నారని, తాము అధికారంలోకి వస్తే పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీయిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో చిట్‌ఫండ్‌ బాధితులకు డబ్బులు వెనక్కి ఇప్పిస్తామన్నారు. పాకిస్థాన్‌ను చూసి భయపడి పీఓకే గురించి మాట్లాడకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాగా, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొత్తం 21 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఒకేసారి అసెంబ్లీ, లోక్‌స‌భ‌ ఎన్నికలు జరుగుతున్నాయి.

Also Read: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కౌంటర్

పాపం నవీన్ పట్నాయక్, చాలా బాధగా ఉంది: అసోం సీఎం
అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు హిమంత బిశ్వ శర్మ తన ఎక్స్ ఖాతాలో నవీన్ పట్నాయక్, VK పాండియన్ వీడియో షేర్ చేశారు. సీఎం పట్నాయక్ బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో వణుకుతున్న ఆయన చేతిని పాండియన్ పక్కనపెట్టిన విజువల్స్ వీడియోలో ఉన్నాయి. సీఎం పట్నాయక్‌ను పాండియన్ ఎంతగా నియంత్రిస్తున్నారో తలుచుకుంటే చాలా బాధగా ఉందని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఒడిశా పగ్గాలు రాష్ట్ర ప్రజలకు తిరిగి ఇవ్వాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని వ్యాఖ్యానించారు.

 

ట్రెండింగ్ వార్తలు