Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం

టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ప్రస్థానంలో ఎన్ని ఎత్తుపల్లాలు..

NDA Presidential Candidate Draupadi Murmu Profile: రాష్ట్రపతి. అంటే..సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati/President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అటువంటి రాష్ట్రపతిగా ఓ మహిళ పోటీ పడుతున్నారు. అత్యంత సాధారణ మహిళ దేశానికే అధ్యక్షపదవి పోటీ వరకు వెళ్లిన ఆమె ప్రస్థానం తెలుసుకుందాం..

గతంలో ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా తొలి మహిళగా నిలిచారు. ఈ క్రమంలో మరో మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలోకి దిగారు.పైగా ఈ మహిళ ఆదివాసీ మహిళ కావటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భేటీ అయిన బీజేపీ అగ్ర నాయకత్వం.. 64 ఏళ్ల ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది.

ద్రౌపది ముర్ము ఈరోజు (జూన్ 2022) రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీనుంచి అగ్రనాయకులంతా హాజరయ్యారు. బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటీ అనంతరం ఎన్డీఏ అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ని బరిలోకి దింపింది. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించని గౌరవం ద్రౌపది ముర్ముకే దక్కిందని చెప్పాలి. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని.. మంత్రిగా, గవర్నర్​గా మెరుగైన సేవలు అందించారు.

2024 ఎన్నికల్లో కలిసొస్తుందనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంచుకుందనే రాజకీయ వాదనలు పక్కనపెడితే..నిజంగానే ద్రౌపది ముర్ము ఎదుగుదల భారత ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పాఠానికి..స్ఫూర్తికి ఏమాత్రం తక్కువకాదు. రాజకీయంగా ఉజ్వల జ్యోతిలా వెలుగుతున్నప్పటికీ.. ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు.అన్నీ తట్టుకొని నిలబిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె 25 ఏళ్ల కెరీర్ లో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్‌ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగారు.

ద్రౌపది ముర్ము బయోడేటా.. 

64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్​భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్తుడు.

ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్​చరణ్ ముర్ము. మర్ము దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

టీచర్ గా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము.. అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు. అందరి మన్ననలు పొందారు.

1997లో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముర్ము.. రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ – బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా మంత్రిగా పనిచేశారు.

ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.

2010, 2013లో మయూర్‌భంజ్‌ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా కొనసాగారు.

జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు గవర్నర్‌గా సేవలందించారు.

ప్రస్తుతం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి రేసులో నిలిచిన తొలి గిరిజన మహిళగా నిలిచారు.

జూన్ 25న ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు. ఇక ఆమె రాష్ట్రపతిగా ఎన్నిక పూర్తి అయితే భారతదేశానికి రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.

జూలై 18న ఎన్నికలు..
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన అనంతరం బీజేపీ అనూహ్యంగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 29 చివరి తేదీ కాగా.. ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి. జూన్ 21న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు