New Labour Laws : కొత్త లేబర్ చట్టాలు.. మీ జీతం ఎంత కట్ అవుతుంది? చేతికి ఎంత వస్తుంది? చెక్ చేసుకోండి..
New Labour Laws : కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను అమలులోకి తీసుకొచ్చింది. నవంబర్ 21వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.
New Labour Laws
New Labour Laws : కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాలను అమలులోకి తీసుకొచ్చింది. నవంబర్ 21వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. గత కొన్ని దశాబ్దాల్లో కార్మిక చట్టాలు మార్చడం ఇదే తొలిసారి. ఇంత భారీ స్థాయిలో లేబర్ చట్టాలు మారడంతో ఉద్యోగులు, కార్మికుల్లో చాలా గందరగోళం ఉంది. ఎంత జీతం వస్తుంది? జీతం ఎక్కువ కట్ అవుతుందా? చేతికి వచ్చే శాలరీ తగ్గుతుందా? పీఎఫ్ కటింగ్స్ ఎక్కువ ఉంటాయా? ఇలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. అలాంటి సందేహాలకు సమాధానాలు చూద్దాం.
కొత్త లేబర్ చట్టాలతో ఒక రకంగా ‘వేతనాలు’ లేదా ‘కాస్ట్ టు కంపెనీ (CTC)’ అనేదానికి అర్థమే మారిపోయింది. కొత్త చట్టాల ప్రకారం ఒక కంపెనీ తమ ఉద్యోగి లేదా కార్మికుడికి ఇచ్చే వేతనంలో బేసిక్ శాలరీ ప్లస్ డీఏ కలిపి 50శాతం కచ్చితంగా ఉండాలి. దీనివల్ల జరిగేది ఏంటంటే.. CTC అలాగే ఉంటుంది. అందులో ఉండే పీఎఫ్ కటింగ్స్, గ్రాట్యుటీ, అలవెన్స్ ఇలాంటివన్నీ లెక్కలు మారతాయి. దాని వల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. సేవింగ్స్ (పీఎఫ్, గ్రాట్యుటీ రూపంలో) పెరుగుతాయి.
ఇప్పుడు మీ CTC చెక్ చేసుకోండి. మీ సీటీసీలో 25శాతం నుంచి 40శాతంలోపే మీ బేసిక్ శాలరీ ప్లస్ డీఏ కలిపి ఉంటే అది వచ్చే నెల నుంచి పెరుగుతుంది. అంటే మొత్తం సీటీసీలో 50శాతం అవుతుంది. అప్పుడు మీ టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందన్నమాట.
ఇప్పుడు ఎంత సీటీసీకి ఎంత శాలరీ వస్తుందనేది చూద్దాం.
CTC – రూ.7 లక్షలు అయితే..
♦ పాత బేసిక్ శాలరీ – 30% (ఉదాహరణకు) – రూ.2,10,000.
♦ కొత్త బేసిక్ శాలరీ – 50శాతం (కొత్త చట్టం ప్రకారం) – రూ.3,50,000.
♦ గతంలో పీఎఫ్ కటింగ్ – రూ.25,200.
♦ ఇక నుంచి పీఎఫ్ కటింగ్ – 42,000.
♦ గతంలో టేక్ హోమ్ (నెలకి సుమారు) – రూ.49,000.
♦ ఇప్పుడు టేక్ హోమ్ (నెలకి సుమారు) – రూ.45,500.
♦ నెలకి ఎంత జీతం తగ్గుతుంది? సుమారు – రూ.3500 నుంచి రూ.4000.
CTC – రూ.10 లక్షలు..
♦ పాత బేసిక్ శాలరీ – 30శాతం (ఉదాహరణకు) – రూ.3లక్షలు
♦ కొత్త బేసిక్ శాలరీ – 50శాతం (కొత్త చట్టం ప్రకారం) – రూ.5లక్షలు
♦ గతంలో పీఎఫ్ కటింగ్ – రూ.36,000.
♦ ఇక నుంచి పీఎఫ్ కటింగ్ – రూ.60,000.
♦ గతంలో టేక్ హోమ్ (నెలకి సుమారు) – రూ.67,000.
♦ ఇప్పుడు టేక్ హోమ్ (నెలకి సుమారు) – రూ.62,000.
♦ నెలకు ఎంత జీతం తగ్గుతుంది..? : సుమారు రూ.6వేల నుంచి రూ.7వేలు
దీని వల్ల ఉద్యోగులకు లాభమా? నష్టమా?
కొత్త లేబర్ కోడ్స్ వల్ల ఉద్యోగుల జీతం తగ్గిపోతుందనే ప్రచారం బాగా ఉంది. అయితే, కంపెనీ ఇచ్చే సీటీసీ అలాగే ఉంటుంది. కానీ, టేక్ హోమ్ తగ్గుతుంది. అదే సమయంలో పీఎఫ్, గ్రాట్యుటీ లాంటివి పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్నప్పుడే కాదు. ఉద్యోగం విరమణ తర్వాత కూడా సామాజిక భద్రత కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. జీవన చరమాంకంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ రూపంలో ప్లాన్ చేసింది. అయితే, అసలే జీతాలు చాలట్లేదు ఇప్పుడు కట్ చేస్తే ఎలా అనుకునే వారికి కొంచెం బాధ కలిగించే విషయమే. అదే సమయంలో జీతం ఎంత వచ్చినా ఖర్చు పెట్టేస్తాం.. కనీసం అలా అయినా సేవ్ అవుతుంది అనుకునే వారికి ఇది లాభదాయకం.
ఇప్పుడు ఉద్యోగులు ఏం చేయాలి?
టేక్ హోమ్ శాలరీలో కొంత మేర తగ్గుతుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగులు ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎంఐలు ఇతరత్రా పేమెంట్స్ విషయంలో ఎంత తగ్గుతుందో చూసుకుని దానికి తగినట్టు ప్రిపేర్ అవ్వాలి.
