దక్షిణాదిలో ఎలాగైనా పట్టు సాధించాలన్న నిశ్చయానికి వచ్చిన బీజేపీ.. అందుకే ఇలా..

NDA Strategy: ఈ క్రమంలోనే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను పెంచుకునే దిశగా వ్యూహాలు ప్రారంభించింది బీజేపీ. టీడీపీ గతంలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉండేది.

PM Modi

కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీకి.. కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు పెద్ద షాకే ఇచ్చాయి. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా హస్తం చేజిక్కినా.. తెలంగాణలో మాత్రం బలం పెంచుకోగలిగింది కాషాయ పార్టీ. ఇది బీజేపీ ముక్త్‌ సౌత్ ఇండియా మారుతుందేమోనన్న భయం పట్టుకున్న కమల దళం.. కొత్త వ్యూహానికి తెరలేపింది. ప్రాంతీయ పార్టీలను ఎన్డీయేలో చేర్చుకోవడం ద్వారా కూటమిని బలోపేతం చేయడంతో పాటు.. కాంగ్రెస్‌కు వాటిని దూరం చేసే ప్రణాళికకు పదును పెట్టింది.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయేను.. బీజేపీ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. సొంతంగానే మ్యాజిక్‌ ఫిగర్‌ స్థాయి సీట్లు బీజేపీకి దక్కడంతో తమకు తిరుగులేదన్న భావనలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ, డీఎంకే, జేడీయూ, జేడీఎస్‌, శివసేన, అకాలీదళ్‌ వంటి చాలా పార్టీలు ఎన్డీయేకు దూరమయ్యాయి. అయితే.. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ అప్రమత్తమైంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడంతో ఎన్డీయేను మరింత బలోపేతం చేయాలన్న నిశ్చయానికి వచ్చింది.

ఎన్డీయేను బలోపేతం చేయడమే మార్గం
ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న బీజేపీ… దక్షిణాదిలో మాత్రం లోక్‌సభ స్థానాల కోసం ఎదురీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు కర్ణాటకలో ఎలాగైనా పట్టు సాధించాలన్న నిశ్చయానికి వచ్చింది. ఇందుకు ఎన్డీయే కూటమిని బలోపేతం చేయడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను పెంచుకునే దిశగా వ్యూహాలు ప్రారంభించింది బీజేపీ.

ఈ క్రమంలోనే ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల వ్యాఖ్యానించారు. ఫ్యామిలీ ప్లానింగ్‌ కుటుంబ పరంగానే బాగుంటుందన్న ఆయన.. రాజకీయంగా అది కుదరదని పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయంగా కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. తమ విధానాలు, సిద్ధాంతాలను నమ్మి వచ్చే పార్టీలతో జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక ఎన్డీయే కూటమిలోని మిత్రులను తామెప్పుడూ బయటకు పంపలేదని.. రాజకీయ సమీకరణాల వల్లే వారే బయటకు వెళ్లి ఉంటారన్నారు. తద్వారా పాత మిత్రులు తమతో కలవాలన్న ప్రతిపాదనకు పరోక్ష హింట్‌ ఇచ్చారు అమిత్‌షా.

కూటమిని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఇప్పటికే మహారాష్ట్ర నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేత అజిత్‌పవార్‌ను… బీజేపీలో చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకొని ఇండియా కూటమికి పెద్ద షాక్‌ ఇచ్చింది. దాన్ని మర్చిపోకముందే.. మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ను కమలం పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సీటు కట్టబెట్టింది. మరోవైపు.. బీహార్‌లో ఇండియా కూటమిలో ఉన్న జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్‌ను తమవైపు తిప్పుకుంది కమల దళం. నితీశ్‌ చేరిక తర్వాత బీహార్‌లో జయంత్‌ చౌదరి నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ కూడా ఎన్డీయేలో చేరిపోయింది.

అటు.. పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడంలో భాగంగా అకాలీదళ్‌ నేతలతో చర్చలు సాగిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాయే ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే అధికారంలో ఉన్నా.. అక్కడ కాంగ్రెస్‌కు పెద్ద షాక్‌ ఇచ్చే వ్యూహం రచించింది బీజేపీ. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఏపీలో క్లైమాక్స్..

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు పార్టీలతో పొత్తులపై బీజేపీ చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనసేన ఎన్డీయేలో భాగస్వామిగా ఉండగా.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, గతంలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉండేది. ఇప్పుడు ఆ పార్టీని కూడా ఎన్డీయేలో చేర్చుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు సాగిస్తోంది బీజేపీ. రేపో మాపో పొత్తుల ప్రకటన రావచ్చు.

Malla Reddy : కేసీఆర్‌తో భేటీ అయిన మ‌ల్లారెడ్డి.. కాంగ్రెస్‌లో చేరికపై ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు