Dhirendra Krishna Shastri: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ అడ్డంగా బుక్కైన ధీరేంద్ర శాస్త్రి.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు
వాస్తవానికి ఆగస్టు 15 సందర్భంగా హైదరాబాద్‌లో తిరంగా యాత్ర చేపట్టనున్నట్టు సమాచారం. అయితే ఆయన దీని గురించి మాట్లాడుతూ మరోసా స్పందించారు. అంతే, ట్రోలర్స్ కు మంచి మెటీరియల్ అయిపోయింది ఆ వీడియో

Independence Day: బాగేశ్వర్ ధామ్ సర్కార్‌గా ప్రసిద్ధి చెందిన పీఠాధీశ్వర్ ధీరేంద్ర శాస్త్రి తన శైలి, ప్రకటనలతో తరచుగా చర్చలో ఉంటారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్తే ట్రోల్స్ వేయడం ఏంటనే కదా మీ డౌటు.. ఆ విషయానికే వస్తున్నా.
వాస్తవానికి ఆగస్టు 15 సందర్భంగా హైదరాబాద్‌లో తిరంగా యాత్ర చేపట్టనున్నట్టు సమాచారం. అయితే ఆయన దీని గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా ‘ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే’ అని అన్నారు. అంతే, ట్రోలర్స్ కు మంచి మెటీరియల్ అయిపోయింది ఆ వీడియో. ఆ వీడియోలో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ ‘‘సీతా రాముడి దయతో 2023 గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని బేగంబజార్, ఛత్రి, భాగ్యనగర్‌లో నా ప్రియమైన లడ్డూ యాదవ్‌తో కలిసి తిరంగా యాత్రను జరుపుకుంటున్నాను’’ అని అన్నారు. ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే అని మాట్లాడడమే ఆయన పొరపాటు. కాగా జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటారనే విషయం తెలిసిందే.
ఆయన ఈ వీడియో వైరల్ కావడంతో, ప్రజలు రకరకాలుగా కామెంట్ చేయడం ప్రారంభించారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ‘‘వారు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతుంటారు. కానీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం అని తెలియదు’’ అని అన్నారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. ‘‘ఫారమ్ తప్పుగా వచ్చింది’’ అని విమర్శించారు. ఇక అదే సమయంలో చాలా మంది ధీరేంద్ర శాస్త్రి పక్షం వహించి ఇలాంటి మానవ తప్పిదం ఎవరికైనా జరుగుతుందని అంటున్నారు.