Snakebite Antivenom : పాము విషానికి శాస్త్రవేత్తల సరికొత్త మందు.. ల్యాబ్‌లోనే తయారీ.. 100 ఏళ్ల పాత పద్ధతికి చెక్..! ఇది ఎలా పనిచేస్తుందంటే?
Snakebite Antivenom : నాగుపాము, చంద్రనాగు, రాచనాగు వంటి విషపూరిత పాముల విషాన్ని ఎదుర్కొనే కొత్త తరం యాంటీవెనమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
- Harish Thanniru
- Published on- September 11, 2026 / 10:28 AM IST
Snakebite Antivenom
Snakebite Antivenom : పాముకాటు అంటే ఇకపై ప్రాణభయం మరింత తగ్గే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నాగుపాము, చంద్రనాగు, రాచనాగు వంటి విషపూరిత పాముల విషాన్ని ఎదుర్కొనే కొత్త తరం యాంటీవెనమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గుర్రాల నుంచి పదేపదే యాంటీబాడీలు సేకరించే సంప్రదాయ పద్ధతికి భిన్నంగా.. ల్యాబ్‌లోనే పెద్ద మొత్తంలో తయారు చేసే విధానాన్ని రూపొందించారు.
ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ యాంటీవెనమ్ విషప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్నట్లు తేలింది. ఈ పరిశోధన విజయవంతమైతే.. పాముకాటు చికిత్సలో శతాబ్ద కాలంగా కొనసాగుతున్న విధానంలో కీలక మార్పు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), డెన్మార్క్‌కు చెందిన టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి ఈ పరిశోధన చేపట్టారు.
ప్రస్తుతం పాము విషానికి విరుగుడుగా ఉపయోగించే యాంటీవెనమ్‌ను సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఇందులో పాము విషాన్ని అత్యంత స్వల్ప మోతాదులో గుర్రాల శరీరాల్లోకి ప్రవేశపెడతారు. ఆ విషానికి వ్యతిరేకంగా గుర్రాల శరీరంలో తయారయ్యే యాంటీబాడీలను సేకరించి యాంటీవెనమ్‌ను తయారు చేస్తారు. అయితే, జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీలతో తయారు చేయడం వల్ల కొంతమందిలో దురద, అలర్జీ వంటి దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ విధానంలో తయారీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. వేర్వేరు జంతువుల నుంచి సేకరించిన యాంటీబాడీలను ఉపయోగించడం వల్ల ఒక్కో బ్యాచ్ యాంటీవెనమ్ పనితీరులో కూడా కొంత వ్యత్యాసం ఉండొచ్చు.
కొత్తగా అభివృద్ధి చేసిన రీకాంబినెంట్ యాంటీవెనమ్‌లో బయోటెక్నాలజీని ఉపయోగించి ప్రయోగశాలలోనే యాంటీబాడీలను పెద్ద మొత్తంలో తయారు చేసే అవకాశం ఉంది. పరిశోధకులు ఒంటె జాతికి చెందిన జంతువులు, ఉదాహరణకు లామా వంటి వాటి నుంచి నానోబాడీలను సేకరించారు.
వాటిని ఆధారంగా చేసుకుని పాము విషంలోని కీలక విషపదార్థాలను లక్ష్యంగా చేసుకునే ఐదు యాంటీబాడీలతో ప్రత్యేక కాక్టెయిల్‌ను రూపొందించారు. ఈ యాంటీబాడీలను పాము విషాన్ని నిర్వీర్యం చేసేలా అభివృద్ధి చేశారు. ఈ నూతన విధానంలోనూ జంతువుల నుంచి నానోబాడీలను సేకరిస్తున్నారు కదా అనే సందేహం రావచ్చు. అయితే, సంప్రదాయ విధానంతో పోలిస్తే ఇక్కడే కీలకమైన తేడా ఉంది.
జంతువు నుంచి నానోబాడీలను ఒక్కసారి సేకరించిన తర్వాత వాటి జన్యు సమాచారాన్ని (DNA కోడ్) గుర్తించి భద్రపరుస్తారు. ఆ జన్యు సమాచారాన్ని ఉపయోగించి భవిష్యత్తులో ప్రయోగశాలలోనే అదే నానోబాడీలను పెద్ద మొత్తంలో తయారు చేయవచ్చు. దీంతో ప్రతిసారీ జంతువుల నుంచి యాంటీబాడీలను సేకరించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ప్రయోగశాలలో నియంత్రిత విధానంలో తయారు చేయడం వల్ల ఉత్పత్తి నాణ్యతను స్థిరంగా ఉంచడంతో పాటు, సంప్రదాయ యాంటీవెనమ్‌తో వచ్చే కొన్ని దుష్ప్రభావాలను తగ్గించే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ట్రయల్స్‌లో భాగంగా వారు ఎలుకలకు నాగు, చంద్రనాగు, రాచనాగుల విషాన్ని ఎక్కించారు. అవి విషప్రభావానికి గురైన (అరగంట) తరువాత ఈ యాంటీ వెనమ్ ఇవ్వగా ఎలుకలు కోలుకున్నాయి. అయితే, ఇది మనుషుల్లో ఉపయోగించేందుకు అందుబాటులోకి రావాలంటే మరిన్ని పరీక్షలు, క్లినికల్ ట్రయల్స్, నియంత్రణ సంస్థల అనుమతులు అవసరం. అవన్నీ పూర్తయిన తర్వాతే ఇది సాధారణ వైద్య చికిత్సలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
