Rajya Sabha BJP : రాజ్యసభలో బీజేపీ కొత్త చరిత్ర.. 100 దాటిన సభ్యుల సంఖ్య

1990ల తర్వాత దేశంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. 2014లో బీజేపీ ఘనవిజయంతో ప్రధానిగా మోదీ బాధ్యతలు.

Bjp

New History Of BJP  : 543 మంది సభ్యులుండే లోక్‌సభలో అధికారపార్టీకి 400 స్థానాలు దాటినా…పాలన సజావుగా సాగడం, అనుకున్న బిల్లులు ఆమోదింపచేసుకోవడం, చట్టాలు చేయడం…వంటివి అంత తేలిగ్గా జరగవు. లోక్‌సభలో పాటు రాజ్యసభలోనూ బలముంటేనే…అధికార పార్టీ అనుకున్నది చేయగలుగుతుంది. పెద్దల సభలో మెజార్టీ లేకపోతే…బిల్లుల ఆమోదంలో అనేక పార్టీల మద్దతు పొందాల్సి ఉంటుంది. ఏడున్నరేళ్ల క్రితం కేంద్రంలో అదికారంలోకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. అనేక బిల్లుల మద్దతుకు ప్రాంతీయపార్టీల సహకారం తీసుకుంది. నెమ్మదిగా ఆ పరిస్థితి నుంచి బయటపడి, రాజ్యసభలో బలం పెంచుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ..అనుకున్నలక్ష్యం దిశగా సాగుతోంది. ఆ పార్టీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో తన బలాన్ని వంద సీట్లకు పెంచుకుంది. బీజేపీకే కాదు…దేశ రాజకీయాల్లోనే ఇది కీలకపరిణామం. ఎందుకుంటే మూడు దశాబ్దాల తర్వాత ఓ పార్టీకి పెద్దల సభలో ఇంత పెద్దమొత్తంలో బలం ఉండడం ఇదే తొలిసారి. 1990లో అప్పటి అధికార కాంగ్రెస్‌కు ఎగువసభలో 108 మంది సభ్యులుండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎప్పుడూ ఆ స్థాయిలో బలం పెంచుకోలేదు.

Read More : India – Turkmenistan: భారత్ వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని పునరుద్దరించనున్న తుర్క్‌మెనిస్తాన్

1990ల తర్వాత దేశంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. 2014లో బీజేపీ ఘనవిజయంతో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టేనాటికి బీజేపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 55. ఏడున్నరేళ్లకాలంలో ఆ బలాన్ని వందకు పెంచుకుంది. మార్చి 31న అసోం, నాగాలాండ్, త్రిపురలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలవడంతో బీజేపీ బలం వందకు చేరింది. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ నాలుగు, ఆప్ 5, LDF రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. రానున్న రోజుల్లో బీజేపీ సభ్యుల ఈ సంఖ్య మరింత పెరగనుంది. త్వరలో మొత్తం 52 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిలో 11 ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. ప్రస్తుతమున్న బలాబలాలను బట్టి యూపీలోని 11 స్థానాల్లో 8 సీట్లు కమలం ఖాతాకు చేరే అవకాశం ఉంది. మొత్తానికి ఈ పరిణామాలన్నీ గమనిస్తే….బీజేపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత బలంగా ఆ పార్టీ కనిపిస్తోంది. దేశంపై తిరుగులేని పట్టు ప్రదర్శిస్తోంది. అటు కాంగ్రెస్ పతనం కొనసాగుతోంది. ఆ పార్టీ సభ్యుల సంఖ్య రాజ్యసభలో 29కి పడిపోయింది. ఈశాన్య రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో కాషాయ పార్టీ గెలవడంతో మొదటిసారి రాజ్యసభలో అసోం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండాపోయింది.