OBC Quota upto 75%: కులగణన చేసి సంచలనానికి తెరలేపిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. తాజాగా మరో భారీ ప్రకటన చేశారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు (మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్) 65 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అలాగే 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చిన కారణంగా, రిజర్వేషన్ మొత్తం కోటాను 75 శాతానికి పెంచాలని ఆయన ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ కోటా పెంచాలని ఆయన అన్నారు.
మరోవైపు కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు. ఇంతకు ముందు కుల ప్రాతిపదికన జనాభా గణన జరగనప్పుడు, కులాల సంఖ్య తగ్గిందని, పెరిగిందని ఎలా చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా బోగస్ ప్రచారమని, ఇలాంటివి చెప్పకూడదని అన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నేత ప్రేమ్ కుమార్ సభలో లేచి నిలబడగా.. ‘‘కూర్చోండి.. మీరే మా మిత్రుడు’’ అని నితీశ్ కుమార్ అన్నారు. ‘‘నా మాట వినండి. దీని తరువాత మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మేము వింటాము. అప్పుడు మీకు కూడా గౌరవం లభిస్తుంది. దయచేసి మేము చెప్పేది మొత్తం వినండి. నివేదిక తయారు చేసి మీ ముందు ఉంచాము. ఇలా చేసి ఉండాల్సిందని మొదటి నుంచి కేంద్రానికి చెబుతున్నాం. ఇప్పుడు చాలా ఆలస్యం అయింది. 2020, 2021లో జరగాల్సింది జరగలేదు. ఇది ప్రతి పదేళ్లకోసారి జరిగేది. జరిగిన ఆలస్యం జరిగింది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభిద్దాం’’ అని అన్నారు.