Bihar Political Crisis : సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. మహాకూటమితో తెగతెంపులకు కారణం చెప్పిన నితీశ్..

సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్ కు స్వయంగా లేఖ అందజేసిన అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

Nitish Kumar

Nitish Kumar : గత రెండ్రోజులుగా బీహార్ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం 11గంటలకు గవర్నర్ కార్యాలయంకు వెళ్లిన ఆయన.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. ఆర్జేడీ, జేడీయూ మహాకూటమి ప్రభుత్వంను రద్దు చేయాలని గవర్నర్ ను కోరారు. నితీశ్ కుమార్ బీజేపీతో మరోసారి జతకట్టనున్నారు. బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ, జేడీయూకూటమితో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో సాయంత్రం నితీశ్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే, మరో ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని నితీశ్ కు గవర్నర్ సూచించారు.

Also Raed : Bihar Political Crisis : క్లైమాక్స్‌కు చేరిన బీహార్ రాజకీయ పరిణామాలు.. కూలిపోనున్న బీహార్ మహాకూటమి ప్రభుత్వం

సీఎం పదవికి రాజీనామా అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం కొత్త కూటమి ఏర్పడిందని, కానీ, ప్రస్తుతం మహాకూటమిలో పరిస్థితి సరిగా లేదని చెప్పారు. అందుకే మహాకూటమి నుంచి వైదొలిగానని అన్నారు. పార్టీ నేతల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుత మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ ను కోరినట్లు నితీశ్ చెప్పారు. ఇతర పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటుకు ఆలోచన చేస్తామని నితీశ్ కుమార్ తెలిపారు. ఇండియా కూటమి బలహీనపడిందని నితీశ్ అన్నారు.

Also Read : Jayadev Galla : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి

ఇదిలాఉంటే .. నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు రాజ్ భవన్ కు బయల్దేరే ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. నితీశ్ కు శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు బీజేపీతో కలిసి నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్ ఇంటికి వెళ్లారు. ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా నితీశ్ ఎన్నికకోసం వీరు భేటీ అయ్యారు. సాయంత్రం 5గంటలకు సీఎంగా నితీశ్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డాతోపాటు పలువురు బీజేపీ పెద్దలు హాజరవుతారని సమాచారం.

 

 

ట్రెండింగ్ వార్తలు