Jayadev Galla : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇంకనుంచి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు.

Jayadev Galla : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి

Jayadev Galla

TDP MP Jayadev Galla : టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం ప్రకటించారు. రాజకీయాలకు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఇంకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు. రాజకీయాల్లో నా పని పూర్తిగా నిర్వర్తించలేక పోతున్నాననే భావన ఉందని, ప్రజల్లో ఎక్కువ సమయం ఉండలేక పోతున్నానని చెప్పారు. నేను మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని, అయితే, రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులని మౌనంగా ఉండలేను, పార్లమెంట్ లో మౌనంగా కూర్చోవడం నావల్ల కాదని గల్లా పేర్కొన్నారు. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేను. రెండు చోట్ల ఉండలేనందునే రాజకీయం వదిలేశానని గల్లా స్పష్టం చేశారు.

Also Read : Sullurupeta YCP Cader: ఆ ఎమ్మెల్యే మాకు వద్దే.. వద్దు..! ఆసక్తికరంగా సూళ్లూరుపేట వైసీపీ రాజకీయం

ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన, స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లో ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు సమస్యలపై, ప్రత్యేక హోదా విషయంపై, రాజధాని అంశంపై పార్లమెంట్ లో నేను గళమెత్తానని తెలిపారు. ఈ క్రమంలో వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండుసార్లు పిలిచి విచారించిందని, నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని అన్నారు. సీబీఐ, ఈడీ నా ఫోన్ లు ట్యాప్ చేస్తున్నాయని గల్లా జయదేవ్ అన్నారు. రెండేళ్ల క్రితం మా నాన్నకూడా వ్యాపారాల నుంచి రిటైర్డ్ అయ్యారు. ఇకనుంచి పూర్తిస్థాయిలో వ్యాపారాలపై దృష్టిసారించనున్నట్లు గల్లా చెప్పారు. గుంటూరు ప్రజలు నాకు ఇంతకాలం రాజకీయంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములు సహజమని చెప్పిన గల్లా, వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, ఆ తరువాత అవకాశం వస్తే తిరిగి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానని అన్నారు.

Also Raed : 8లక్షల కోట్లు అప్పులు చేశారు, కనీసం రాజధాని అయినా నిర్మించారా? వైఎస్ షర్మిల ఫైర్

గల్లా జయదేవ్ టీడీపీ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీచేసి విజయంసాధించారు. అయితే, గతకొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు గల్లా జయదేవ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని , తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ అధిష్టానంకు గతంలోనే జయదేవ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పూర్తిస్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బహిరంగంగా వెల్లడించారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్. తల్లి తరువాత రాజకీయాల్లోకి వచ్చి, రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. జయదేవ్ కు అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఉంది. ఇతర వ్యాపారాలుకూడా ఉన్నాయి.