Sullurupeta YCP Cader: ఆ ఎమ్మెల్యే మాకు వద్దే.. వద్దు..! ఆసక్తికరంగా సూళ్లూరుపేట వైసీపీ రాజకీయం
మూడేళ్లుగా పార్టీలో విభేదాలు ఉన్నా.. అధిష్టానం చక్కదిద్దకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పార్టీలో అన్నివర్గాలు ఒక్కటై పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Kiliveti Sanjeevaiah
Sullurpeta Assembly constituency : ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సూళ్లురుపేట నియోజకవర్గం పాలిటిక్స్ ఇంట్రస్టింగ్‌గా మారాయి. గత ఎన్నికల్లో జిల్లాలో పదికి పది స్థానాలు వైసీపీ గెలుచుకోగా, సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన సంజీవయ్య.. వచ్చే ఎన్నికల్లోనూ పోటీచేయాలని తహతహలాడుతున్నారు. 2019 ఎన్నికలలో 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన సంజీవయ్య తొలి రెండేళ్ల పాటు నియోజకవర్గంలో ఎదురులేనట్లు చక్రంతిప్పారు. ఆ తర్వాత ఏమైందోగాని… సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్‌రెడ్డితోపాటు కొందరు కౌన్సిలర్లు, నాయుడుపేట మునిసిపల్ వైస్ చైర్మన్ రఫీతో సహా ఇంకొందరు నేతలు ఎమ్మెల్యేపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఎమ్మెల్యేపై నేరుగా విమర్శలు చేయడంతోపాటు ఈసారి ఆయనకే మళ్లీ టికెట్ ఇస్తే సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు.
Also Read : 8లక్షల కోట్లు అప్పులు చేశారు, కనీసం రాజధాని అయినా నిర్మించారా? వైఎస్ షర్మిల ఫైర్
కొద్దిరోజుల క్రితం జాతీయరహదారిపై పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని అడ్డుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫిర్యాదుచేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తన వ్యతిరేకవర్గానికి దీటుగా ఎమ్మెల్యే కూడా తన వర్గంతో బలప్రదర్శన చేయడంతో వైసీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులుచేస్తున్నా.. వైసీపీ హైకమాండ్ ఇంతవరకు సూళ్లూరుపేట ఊసెత్తలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేను ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో.. అదేస్థాయిలో ఎమ్మెల్యే అనుకూల వర్గం కూడా ఉండటం, వరుసగా రెండుసార్లు గెలవడంతో సంజీవయ్య సీటు ప్రస్తుతానికి సేఫ్ అన్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సీఎం జగన్ షాక్? రసవత్తరంగా జమ్మలమడుగు రాజకీయం
క్యాడర్ వ్యతిరేకిస్తున్నా.. అధిష్టానం మాత్రం ఎమ్మెల్యేకే బాసటగా నిలవడంతో అసమ్మతివర్గం రగిలిపోతోంది. సీఎం జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దంటూ ఎంతలా గొంతు చించుకుంటున్నా.. సూళ్లూరుపేటలో ఎటువంటి మార్పుల్లేవని రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తేల్చిచెప్పడంతో ఎమ్మెల్యే వ్యతిరేకులు షాక్ తిన్నారు . కొద్దిరోజుల క్రితం జరిగిన సామాజిక బస్సు యాత్రలో నాయుడుపేట వచ్చిన విజయసాయిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సంజీవయ్య ఉంటారని స్పష్టంగా ప్రకటించడంతో.. తమ భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు అసమ్మతివర్గం నేతలు.. అయితే, వీరిని ప్రసన్నం చేసుకోడానికి ఎమ్మెల్యే సంజీవయ్య పడరాని పాట్లు పడుతున్నారు. మీడియా ముఖంగా క్షమించమని క్యాడర్‌ను ప్రాధేయపడుతున్నారు. కానీ, వ్యతిరేకవర్గం మాత్రం ఎమ్మెల్యేపై కనికరం చూపడం లేదు. సంజీవయ్యను తప్పించాల్సిందేనన్న డిమాండ్ చేస్తుండటంతో సూళ్లూరుపేట పాలిటిక్స్ హైటెన్షన్‌గా మారాయి.
అయితే, మూడేళ్లుగా పార్టీలో విభేదాలు ఉన్నా.. అధిష్టానం చక్కదిద్దకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పార్టీలో అన్నివర్గాలు ఒక్కటై పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికైనా అధిష్టానం ఇరువర్గాలను ఒకచోటే చేర్చి ఐకమత్యంగా పనిచేసేలా ఒప్పించకపోతే… వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా వచ్చే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నారు.