ఆప్ తో పొత్తు లేదు: ప్రకటించిన కాంగ్రెస్

సార్వత్రిక ఎన్నికలవేళ కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు సిద్దం అవుతున్న కాంగ్రెస్ ఢిల్లీలో కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులు పెట్టుకునే విషయమై సమాలోచనలు జరుపేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఢీల్లీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటి అయ్యారు. భేటి అనంతరం మాట్లాడిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షత్.. ఆప్ పార్టీతో పొత్తు లేదంటూ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందని వెల్లడించారు. షీలా దీక్షిత్ ప్రకటనతో ఢిల్లీలో ఆప్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న ఊహాగానాలకు తెరపడినట్లైంది.
Also Read : పుల్వామా ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సంబంధించిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆరు స్థానాలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను ప్రకటించారు. తమతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు రెండు సీట్లను ఇచ్చేందుకు ఆప్ సిద్ధంగా ఉండగా కాంగ్రెస్ మూడు సీట్ల కావాలని కోరింది. పంజాబ్ లో కూడా కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ సిద్ధంగా ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 స్థానాల్లో 67 స్థానాల్లో ఆప్ గెలిచి సంచలన విజయం నమోదు చేసింది.
Also Read : అటో ఇటో ఎటో : పవన్ కల్యాణ్ తో మాగుంట భేటీ