నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా చెప్పిన ఫిబ్రవరి-1,2020న దోషులను ఉరితీయడం లేదు. నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ ఢిల్లీ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పటియాలా కోర్టులోని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ఈ తీర్పు ఇచ్చారు. వినయ్ కుమార్ శర్మ క్షమాబిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది కనుక ఉరిశిక్షను వాయిదా వేయాలని ముగ్గురు నిందితులు పవన్ గుప్తా,వినయ్ కుమార్ శర్మ,అక్షయ్ కుమార్ ల తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ ఏపీ సింగ్ కోర్టును అభ్యర్థించారు.
ఒకరి క్షమాబిక్ష పిటిషన్ మాత్రమే పెండింగ్ లో ఉందని, మిగతావాళ్లను ఉరితీయవచ్చని,ఈ కేసులో తమ ఉరిశిక్ష నిలుపుదల కోరుతూ ముగ్గురు నిందుతుల దాఖలు చేసిన పిటిషన్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు తీహార్ జైలు అధికారులు. అయితే ఒక కేసులో ఒక దోషి పెండింగ్ లో ఉన్నప్పుడు మిగిలిన వారిని ఉరితీయకూడదని రూల్స్ నిర్దేశిస్తున్నాయని నిందితుల తరపు లాయర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితుల ఉరిశిక్ష ఆపాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. అయితే అంతకుముందు తాను నేర సమయంలో మైనర్ అని పవన్ పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మరో నిందితుడు ముఖేష్ కుమార్ క్షమాబిక్ష పిటిషన్ ను జనవరి-17,2020న రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే. తన క్షమాబిక్షను తిరస్కరించడంపై సుప్రీంను ఆశ్రయించాడు ముఖేష్. అయితే బుధవారం ముఖేష్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు.
ఫిబ్రవరి-1 ఉదయం 6గంటలకు నలుగురు నిందితులను ఉరితీయాలంటూ జనవరి17,2020న ట్రయల్ కోర్టు రెండోసారి బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు నిందితులను జనవరి-22,2020న ఉరితీయాలంటూ జనవరి-7,2020న కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వినయ్,అక్షయ్ లు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పవన్ ఇంకా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. దోషుల క్యూరేటివ్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేసిన తరువాత మాత్రమే అధ్యక్షుడి ముందుకు క్షమాబిక్షపిటిషన్ వచ్చే అవకాశముంటది.
దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.