NPR..NRCలకు సంబంధం ఉంది…అమిత్ షానే చెప్పారు

ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్ పీఆర్ ప్రకియ చేపడుతోందని, ఇది ఎన్ఆర్సీకి సంబంధించినదేనని ఓవైసీ తెలిపారు. హోంశాఖ మంత్రి అమిత్ షా దేశాన్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు అని అసదుద్దీన్ ప్రశ్నించారు. పార్లమెంట్ లో అమిత్ షా తన పేరును ప్రస్తావిస్తూ…దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు అవుతుంది ఓవైసీ గారు అని అన్నారన్నారు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నంతకాలం తాము నిజం చెబుతూనే ఉంటామన్నారు.

ఏప్రిల్ 2020లో ఎన్ పీఆర్ ముగిసిన తర్వాత అధికారులు డాక్యుమెంట్లు అడుగుతారని,ఫైనల్ లిస్ట్ ఎన్ఆర్సీగా ఉంటుందని ఓవైసీ అన్నారు. అమిత్ షా తనకంటే ఎక్కువ విద్యావంతుడని తాను అంగీకరిస్తున్నానని,2018-19నాటి హోంశాఖ వార్షిక రిపోర్ట్ లోని చాప్టర్ 15ను ఆయన ఒకసారి చదవాలన్నారు. పాయింట్ నెం.4లో అమిత్ షానే స్వయంగా ఎన్ఆర్ ఐసీ  ప్రకియ చేపట్టేదాంట్లో మొదటిమెట్టే ఎన్ పీఆర్ అని చెప్పారని ఓవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నవారిలో 18మందిని ఎవరు చంపారు అని షా ప్రశ్నించారు. దీనిపై స్వతంత్ర విచారణ జరగాలన్నారు. 5వేల400మందిని జైళ్లల్లో పెట్టారన్నారు. ప్రధాని దీనిపై నోరు విప్పాలని ఓవైసీ అన్నారు.

2021 జనాభా లెక్కల కోసం 8వేల 754కోట్లు, జాతీయ పౌర పట్టిక(NPR) అప్ డేట్ కోసం 3వేల 941కోట్ల ఖర్చుకు మంగళవారం కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం సాయంత్రం ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ…ఎన్ పీఆర్,ఎన్ఆర్సీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

పౌరులు ఎవ‌రైనా ఒక ప్రాంతంలో ఆరు నెల‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం ఉన్న‌వారందరినీ జాతీయ జనాభా రిజిస్టరు(NPR)లో చేరుస్తారు. దీనితోపాటు కుటుంబ పెద్దకు సంబంధించిన 29 రకాల వివరాలు సేకరిస్తారు. వీటిలో వయసు, వృత్తి, పుట్టిన స్థలం, మాతృభాష, మతం, కులం వంటికి ఉంటాయి. దేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఎన్‌పీఆర్‌లో తప్పనిసరిగా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనాభా లెక్క‌ల‌(సెన్స‌స్‌)కు ఎన్‌పీఆర్ అనుసంధాన‌మై ఉంటుంది. ఎన్‌పీఆర్‌ గణాంకాలను మొదటిగా 2010లో సేకరించారు. 2011 భారత జనాభా లెక్కల్లో ఇండ్ల జాబితా దశలో భాగంగా ఎన్‌పీఆర్‌ను కూడా నాటి యూపీయే ప్రభుత్వం సేకరించింది. 2015లో ఎన్‌పీఆర్ డేటాను ఇంటింటి స‌ర్వే ద్వారా అప్‌డేట్ చేశారు. 

అయితే ఎన్ పీఆర్ కోసం ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదని. ప్రజల నుంచి ఎలాంటి ఆధారాలూ స్వీకరించడం లేదని, బయోమెట్రిక్ కూడా తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఇందుకోసం స్పెషల్‌ మొబైల్‌ ఆప్‌ కూడా తీసుకొస్తామన్నారు. ప్రజలు ఈ యాప్‌ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేయవచ్చు. స్వయం ప్రకటిత వివరాల ఆధారంగా గణన వుంటుందని జావడేకర్ తెలిపారు. అస్సాం మిన‌హా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది.

వివరాలు ఆధారంగా రూపొందే జనాభా రిజిస్టరు నుంచి జాతీయ పౌరసత్వ రిజిస్టరు తయారు చేస్తారు. ఎన్‌ఆర్‌సి తయారీ ముందు ”ఎవరి పౌరసత్వం అనుమానాస్పదమో” అటువంటి వారందరి జాబితానూ రూపొందించి వేరు చేస్తారు. ఆ అనుమానస్పదుల జాబితాలో చేరిన వారంతా తమ పౌరసత్వాన్ని ఆధారాలతో రుజువు చేసుకోవాలి. అంటే ఎన్‌ఆర్‌సి తయారీలో తొలి మెట్టు జాతీయ జనాభా రిజస్టరు (ఎన్‌పిఆర్‌)అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.