Odisha Congress Leader Narasingha Mishra : ఒడిశాలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ర్యాలీలో ఆ పార్టీ సీనియర్ నేత నరసింఘా మిశ్రా (Narasingha Mishra) స్ప్రహ తప్పి పడిపోయారు. భువనేశ్వర్‌లో ప్రకంపనలు సృష్టించిన చిట్ ఫండ్ స్కామ్ (Chit-fund scam) దర్యాప్తులో సీబీఐ (CBI) అనుసరిస్తున్న తీరుకు వ్యతీరేకంగా కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ కుంభకోణంలో అధికార పార్టీ బిజు జనతా దళ్ లీడర్లు ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మధ్యనే ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలను సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. అయితే సీబీఐ నిజాలు దాస్తుందంటూ కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది.
కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ సీనియర్ నేత నరసింఘా మిశ్రా కూడా పాల్గొన్నారు. రోడ్ షోలో భాగాంగా సీబీఐ ఆఫీస్ ముందు ఆయన ప్రసంగించారు. సీబీఐ తీరుపై విమర్శలు కూడా చేశారు. బీజేడీ నేతల అరెస్ట్‌లో సీబీఐ జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. మిశ్రాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
చిట్ ఫండ్ కుంభకోణంపై కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీకి హాజరవ్వడానికి మిశ్రా.. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. దీనికి తోడు ఆయన డయాబెటిస్ పేషెంట్ కావడంతో నీరసించారు. ఆరోగ్యం సహకరించకున్నా కాంగ్రెస్ విన్నపం మేరకు రోడ్ షోలో పాల్గొని అస్వస్థతకు గురయ్యారు. రోడ్‌షోలో కూడా అగ్రెసివ్‌గా ఒడిశా అధికార పార్టీ, బీజేడీతో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు మిశ్రా. అలా మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.