కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్-14తో ముగియనున్న సమయంలో,కరోనా కేసుల పెరుగుదల ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కాగా,లాక్ డౌన్ ను పొడిగించిన రెండవ రాష్ట్రంగా ఒడిషా నిలిచింది. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు అన్ని రైలు,విమాన సర్వీసులను రద్దు చేయాలని తాను కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.
రాష్ట్రంలోని విద్యాసంస్థలు అన్నీ జూన్ 17వరకు మూసివేస్తూ ఒడిషా క్యాబినె నిర్ణయం తీసుకుంది. సీఎం పట్నాయక్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఐదుగురు సీనియర్ మంత్రులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో మొదటిసారి క్యాబినెట్ భేటీ నిర్వహించారు. ఒడిషాలో ఇప్పటివరకు 42 కరోనా కేసులు నమోదుకాగా,ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా,లాక్ డౌన్ ను పొడిగించిన రెండవ రాష్ట్రంగా ఒడిషా నిలిచింది. అయితే బుధవారం పంజాబ్ ప్రభుత్వం ఏప్రిల్-30వరకు లాక్ డౌన్ ను పొడిగిసున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేవరకూ లాక్ డౌన్ కొనసాగించాలని భావిస్తున్నట్టు బుధవారం కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ ఎత్తివేయాల్సి వస్తే దశలవారీగా తొలగించే యోచనలో కేంద్రం ఉంది. లాక్ డౌన్ కొనసాగింపుపై పార్లమెంటరీ పక్ష నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టతనిచ్చారు. దేశం ఇప్పుడు సోషల్ ఎమర్జెన్సీతో డీల్ చేస్తుందన్న మోడీ… రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నాయని, ఏప్రిల్ 11న సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఒకేసారి లాక్ డౌన్ ఎత్తివేయలేమని ప్రధాని సృష్టంగా చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే అన్నింటికన్నా ముఖ్యమని ప్రధాని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల నమోదు తీవ్రతను బట్టి లాక్ డౌన్ మరిన్నిరోజులు పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు
ఇక భారత్ లో ఇప్పటివరకు 5,734 కరోనా కేసులు నమోదయ్యాయి. 166 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1,135 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా తమిళనాడులో(738) నమోదయ్యాయి. 699 పాజిటివ్ కేసులతో ఢిల్లీ మూడవ స్థానంలో నిలిచింది.
Also Read | తెలంగాణ కరోనా ఆస్పత్రుల్లో బాధితులకు ఏ దశలో.. ఏయే మందులు ఇస్తున్నారంటే?