మహిళ లొంగిపోతే శృంగారానికి ఒప్పుకున్నట్టు కాదు…కేరళ హైకోర్టు

  • Published By: venkaiahnaidu ,Published On : July 7, 2020 / 09:44 PM IST
మహిళ లొంగిపోతే శృంగారానికి ఒప్పుకున్నట్టు కాదు…కేరళ హైకోర్టు

Updated On : July 7, 2020 / 10:34 PM IST

ఓ మహిళ పురుషుడికి లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు తెలిపింది. శారీరక సంబంధానికి స్త్రీ ‘ఆహ్వానం పలికితేనే ఆమె హక్కులకు భంగం కలగలేదని భావించాలంటూ అత్యాచారానికి సంబంధించి జడ్జి పీబీ సురేష్ కుమార్ మరో నిర్వచనాన్ని చెప్పారు.

2009 నాటి అత్యాచార కేసుకు సంబంధించి 59ఏళ్ళ నిందితుడు చేసిన అప్పీలుపై తీర్పునిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

2009లో 14ఏళ్ళ ఓ బాలిక టీవీ చూసేందుకు పొరుగునే ఉన్న నిందితుడి ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో నిందితుడు ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. దీని వల్ల ఆమె గర్భం కూడా ధరించింది. కాగా.. ఈ కేసులో అతడిని కింది కోర్టు అత్యాచార దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది.

అయితే అతడు పైకోర్టులో అప్పీలు చేశాడు. బాలిక తన కోసం పలుమార్లు వచ్చి వెళ్లేదని వాదించే ప్రయత్నం చేశారు. దీనర్థం తనకు దగ్గరయ్యేందుకు ఆమె సమ్మతించినట్టేనని చెప్పుకొచ్చాడు. కానీ కోర్టు అతడి వాదనలు కొట్టేసింది. మైనర్ బాలిక ఇచ్చిన సమ్మతిని పరస్పర అంగీకారంతో కూడిన కలయికగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ.. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీకరించినట్టు కాదని హైకోర్టు తెలిపింది.