Rahul Gandhi and Nitish kumar
Opposition Parties Meeting: బెంగళూరు వేదికగా ఈనెల 12, 13 తేదీల్లో జరగాల్సిన విపక్షాల సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. గత నెల 23న పాట్నాలో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన విపక్షాల సమావేశం జరగగా.. రెండ దఫా సమావేశాన్ని ఈనెలలో నిర్వహించాలని భావించారు. అందుకు తేదీలను కూడా వెల్లడించారు. కానీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలిక కారణంగా బెంగళూరులో జరగాల్సిన విపక్షాల సమావేశంను వాయిదా వేసినట్లు తెలిసింది. అయితే, ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
విపక్షాల బెంగళూరు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జేడీ(యు) ముఖ్య అధికార ప్రతినిధి కెసి త్యాగి తెలిపారు. పార్లమెంట్ వర్షాల సమావేశాల తర్వాత తదుపరి సమావేశం ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 20 వరకు కొనసాగనున్నాయి. త్వరలో బీహార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (జూలై 10 నుంచి 14 వరకు), కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్, వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బెంగళూరులో ప్రతిపాదించిన సమావేశం వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్రంలో ఎన్సీపీ పార్టీలో చీలిక సమయంలో విపక్షాల బెంగళూరు సమావేశంకు ప్రాధాన్యత ఏర్పడింది. కానీ, సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
Nitish Kumar: మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన నితీశ్ కుమార్
బీజేపీయేతర పక్ష పార్టీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తృతీయ ఫ్రంట్‌గా ఏర్పడి బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన తొలిసారి జూన్ 23న పాట్నాలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ థాకరే, శరద్ పవార్, ఒమార్ అబ్దుల్లా, మెహబూబా మఫ్తీ తదితర నేతలు పాల్గొన్నారు. ఆ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశ పునాదులపై బీజేపీ దాడి చేస్తోందని, ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చునని అన్నారు. ఈ క్రమంలో తమలో విబేధాలు ఉన్నప్పటికీ పక్కనపెట్టి కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ చెప్పారు.