ట్రంప్ కోసం రాష్ట్రపతి విందు…హాజరుకానన్న మన్మోహన్

రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల సీఎంలను,ప్రముఖులను విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి ఆహ్వానించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌(87)ను కూడా విందుకు ఆహ్వానించారు. 

అయితే డొనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ లో పాల్గొనకూడదని మన్మోహన్ సింగ్ డిసైడ్ అయ్యారు. నాలుగు రోజుల విందు ఆహ్వానానికి ఓకే చెప్పిన మన్మోహన్ ఇప్పుడు సడన్ గా వెళ్లకూడదని నిర్ణయించారు. ఆరోగ్య కారణలతో హాజరుకాలేనని రాష్ట్రపతి భవన్ కు మన్మోహన్ సమాచారమిచ్చారు. అయితే ఆరోగ్యకారణాల దృష్యా హాజరుకాలేనని మన్మోహన్ చెబుతున్నప్పటికీ దీని వెనుక వేరే కారణమున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందకపోవడంతో కాంగ్రెస్ నేతలు అలకబూనినట్లు తెలుస్తోంది.

అధ్యక్షుడు ట్రంప్ మరియు ప్రతిపక్ష నాయకుల మధ్య ఎటువంటి సమావేశం నిర్వహించబడట్లేదు. విదేశీ నాయకులు భారత పర్యటనకు వచ్చినప్పుడు విపక్షాలకు చెందిన సీనియర్‌ నేతలను ఆహ్వానించే ఆనవాయితీని పక్కనబెట్టారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకురాలు సోనియాను పట్టించుకోకపోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు అప్ సెట్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత గులాంనబీ ఆజాద్,లోక్ సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కూడా రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ లో పాల్గొనకూడదని నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు