Odisha’s Malkangiri
Odisha Malkangiri : అసలే ఎండాకాలం..ఆపై కరోనా..దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. బయటకు వచ్చిన వారు..కూల్ కూల్ గా ఉండే..పానీయాలను సేవిస్తున్నారు. కానీ..చల్లచల్లగా ఉన్న లస్సీని తాగిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో మల్కన్ గిరి జిల్లా కుర్తీ విలేజ్ లో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో వారాంతపు సంత జరుగుతుంటుంది.
పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు అక్కడ ఉన్న ఓ దుకాణంలో లస్సీ తాగారు. అనంతరం ఎవరింటికి వారు వెళ్లారు. కొద్దిసేపటికి లస్సీని తాగిన వారు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆసుపత్రులకు పరుగులు తీశారు. దాదాపు వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా ఒకే సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు గుర్తించారు. అందరూ లస్సీ తాగారని గుర్తించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
దీనిపై సీడీఎంఓ ప్రఫుల్లా కుమార్ స్పందించారు. వెంటనే కుర్తీ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఎవరైనా ఈ బాధతో పడుతున్నారో గుర్తించారు. లస్సీలో ఏమైనా కలిసిందా? ఇందులో వాడిన ఐస్ మంచిదేనా ? తదితర వివరాలను సేకరిస్తున్నారు.