తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం 

  • Publish Date - January 26, 2019 / 09:38 AM IST

ఒడిశాలోని తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం
ప్రకాశం జిల్లా నుండి ఒడిశాలో స్థిరపడ్డ దేవరపల్లి ప్రకాశరావు 
పేద పిల్లలకు చదువు..రక్తదానం వంటి పలు సేవలకు పద్మశ్రీతో గౌరవం

ఒడిశా :  సేవకు అరుదైన గౌరవం దక్కింది.  పేదరికంలో వున్నా..సేవాగుణంతో సాటివారి కష్టానికి చలించిపోయే ఓ సాధారణ చాయ్ వాలాకు  భారత అత్యున్నత పురస్కారాలలో ఒకలైన పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రపంచంలో తెలుగువారు లేని ప్రాంతమంటు లేదంటే అతిశయోక్తి కాదు. జీవనాధారం కోసం పలు ప్రాంతాలలో తెలుగువారు నివసిస్తున్నారు. వారు ఎక్కడున్నా..వారి ప్రతిభను గుర్తించి పద్మ అవార్డులకు కేంద్రం ఎంపిక చేస్తోంది. ఈ క్రమంలో టీ అమ్ముకొని జీవనం సాగించే ఓ తెలుగు వ్యక్తి పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు. కటక్‌లో స్థిరపడిన ఆయన టీ విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముతో పిల్లల కోసం స్కూల్ నడుపుతున్నారు. సంపాదనలో సగం వారికే ఖర్చు చేస్తున్నారు.ఒడిశాలోని కటక్‌లో టీ స్టాల్‌ నడుపుతూ సాధారణ జీవనం సాగించే ఓ తెలుగు వ్యక్తి పద్మ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనే దేవరపల్లి ప్రకాశరావు. 

పద్మ శ్రీ పురస్కారానికి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారనే సంగతి అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్‌లో జన్మించిన ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీకి తెలంగాణ కోటాలో పద్మ శ్రీకి ఎంపిక చేశారు. వీరే కాకుండా ఒడిశా కోటా నుంచి దేవరపల్లి ప్రకాశ్ రావు ఎంపికయ్యారు. ఒడిశాలోని కటక్‌లో టీ స్టాల్‌ నడుపుతూ సాధారణ జీవనం సాగించే ఆయన.. సేవాగుణంలో మాత్రం ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు.

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్ రావు పూర్వీకులు ఒడిశాలోని కటక్‌లోని బక్సీ బజార్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ప్రకాశరావు టీస్టాల్ నే జీవనాధారంగా చేసుకున్నారు. బక్సీ బజార్ లో ఉండేవాళ్లంతా పేదలే. అక్కడ పిల్లలు చదువకోవడానికి కనీసం స్కూల్ కూడా లేదు. దీంతో ప్రకాశరావు తన ఇంటినే స్కూల్‌గా మార్చేశారు. రోజూ టీ..రొట్టెలు అమ్మగా వచ్చిన చిన్నపాటి ఆదాయంలో సంగం ఆదాయంతోనే ప్రకాశరావు కుటుంబ జీవిస్తోంది. మిగతా సగాన్ని పేద పిల్లకు పుస్తకాల కొనటం..వారి భోజనానికే వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం నిలిచిపోయినా.. తన కుటుంబ ఖర్చులను తగ్గించుకొని మరీ ప్రకాశ్ రావు పిల్లలను చదివిస్తున్నారు. దీంతో ప్రకాశరావు వ్యతిరేకత వచ్చిన క్రమంలో చదువు అవసరాన్ని వారికి చెప్పి ఒప్పించారు. తన ఇద్దరు కూతుళ్లను చదివించి వారికి మంచి జీవితాన్ని అందించిన ఈయన తన బస్తీలోని పిల్లల బాధ్యతను తీసుకున్నారు ప్రకాశరావు.

అంతేకాదు..ప్రకాశ్ రావు రక్తదానం చేసి ఎందరో జీవితాలను నిలబెట్టారు. 40 ఏళ్ల క్రితం ఆయనకు ఆపరేషన్ జరగ్గా రక్తం అవసరమవటంతో ఓ దాత రక్తం ఇవ్వటంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు తాను కూడా రక్తదానం చేయాలని. ఎవరికి రక్తం అవసరమన్నా రెక్కలు కట్టుకుని వాలిపోతారు ప్రకాశరావు. ఇప్పటి వరకూ 200సార్లకుపైగా రక్తదానం చేశారు. 17సార్లు పేట్‌లెట్స్ దానం చేశారు. రోజూ సమీపంలోని హాస్పిటల్‌‌కు వెళ్లి పేద రోగులకు తోచిన సాయం కూడా చేస్తుంటారు. 
అలా ఆయన గురించి ఒడిశా మొత్తం ప్రకాశరావు పేరు  మార్మోగింది. హ్యూమన్ రైట్స్ అవార్డ్, అనిబిసెంట్ అవార్డ్ సహా పలు పురస్కారాలు ఆయనకు దక్కాయి. ప్రకాశ్ రావు గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓసారి కటక్ వెళ్లినప్పుడు ఆయన్ను కలిసి అభినందించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేవరపల్లి ప్రకాశరావు సేవల్ని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. మరి అంతేకదా..తెలుగువారే కాదు ప్రపంచంలో ప్రతిభ..సేవా గుణం  ఎక్కడ వున్నా..గుర్తింపబడుతుంది. అదికూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసే సేవకు తగిన పురస్కారం ఈ పద్మశ్రీ అవార్డు. కాగా 2018కి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 112 అవార్డు ప్రకటించగా..దేవరపల్లి ప్రకాశ్ దానిలో ఒకరు.