Pahalgam Terror Attack: గుండెలు పిండే విషాదం.. వారం క్రితమే వివాహం, ఇంతలోనే దారుణం.. హనీమూన్‌కు వచ్చి భర్తను కోల్పోయిన భార్య..

హనీమూన్ కి సరదాగా పహల్గాం వచ్చారు. అదే వారిని విడదీస్తుందని అప్పటికి వారికి తెలీదు.

Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. మాటు వేసి అదను చూసి మారణహోమం సృష్టించారు. పర్యాటకులే టార్గెట్ గా నెత్తుటి ఏరులు పారించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రకృతి అందాలు చూస్తూ సరదాగా గడిపేందుకు వచ్చిన వారు టెర్రరిస్టుల తూటాలకు బలైపోయారు. కళ్ల ముందే తమ వారిని ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే.. కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది.

బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. కొందరు భర్తలను కోల్పోయారు, మరికొందరు పిల్లలను కోల్పోయారు.. ఇలా ఒక్కో కుటుంబంలో ఒక్కో రకమైన విషాదం అలుముకుంది.

మృతుల్లో అందరికంటే గుండెలు పిండే విషాదం ఎవరిదంటే.. కొత్తగా పెళ్లైన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ దంపతులదే. వారం క్రితం వివాహం చేసుకుని లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ దంపతులు హనీమూన్ కు పహల్గాం వెళ్లారు. అదే తమను విడదీస్తుందని ఆ నవ వధువు ఊహించలేకపోయింది. మృత్యువు ఉగ్రదాడి రూపంలో వారి బంధాన్ని ముక్కలు చేసింది. కళ్ల ముందే ఆమె భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు.

కొత్తగా పెళ్లైంది. వైవాహిక జీవితంపై ఎన్నో కలలు కన్నారు. హనీమూన్ కి సరదాగా పహల్గాం వచ్చారు. అదే వారిని విడదీస్తుందని అప్పటికి వారికి తెలీదు. చేయి చేయి పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా సడెన్ గా ఉగ్రవాదులు అటాక్ చేశారు. భర్తను పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపారు. కళ్ల ముదే కట్టుకున్న వాడిని కోల్పోయిన నవవధువు నోట మాట రాక భర్త చెంతే కుప్పకూలి నిశ్చేష్టురాలైంది. ఆ ఫొటో యావత్ దేశ ప్రజల గుండెలను మెలిపెడుతోంది.

Also Read: జమ్ముకశ్మీర్‌పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన ఆ వ్యాఖ్యలే ముష్కరుల మారణహామానికి కారణమా?

అతడి పేరు వినయ్ నర్వాల్. ఆ నవ వధువు పేరు హిమాన్షీ నర్వాల్. వినయ్ నర్వాల్ ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్. హర్యానాలోని కర్నాల్ కు చెందిన వినయ్ నర్వాల్(26) ఏప్రిల్ 16న హిమాన్షీ నర్వాల్ ను పెళ్లి చేసుకున్నారు. రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు. మూడు రోజుల పాటు రిసెప్షన్ నిర్వహించారు. ఆ తర్వాత సోమవారం రోజున హనీమూన్ కోసం జమ్మకశ్మీర్ లోని పహల్గాం వెళ్లారు. బైసరన్ లోయలో పచ్చిక బయళ్లలో కూర్చున్నారు.

బేల్ పూరి తింటూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో దారుణం జరిగింది. సడెన్ గా చుట్టుముట్టిన ఉగ్రవాదులు వినయ్ నర్వాల్ ను కాల్చి చంపారు. అతడి తలలో బుల్లెట్ దిగింది. అంతే.. హిమాన్షీ నర్వాల్ షాక్ కి గురయ్యారు. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే భర్త విగతజీవిగా తన ముందు పడి ఉన్నాడు. హిమాన్షీ నర్వాల ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి. భర్త మృతదేహం ముందు నవవధువు భోరున విలపించిన వైనం యావత్ దేశ ప్రజల కళ్లలో నీళ్లు తెప్పించింది.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన తన భర్త, భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కు భార్య హిమాన్షీ నర్వాల భావోద్వేగ వీడ్కోలు పలికారు. భర్త భౌతికకాయం దగ్గర నిల్చుని బోరున విలపించారు. ”ఆయన వల్లనే ప్రపంచం ఇంకా మనుగడ సాగిస్తోంది. మనమందరం అతని గురించి అన్ని విధాలుగా గర్వపడాలి” అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు హిమాన్షీ నర్వాల్. చివరగా తన భర్తకు సెల్యూట్ చేస్తూ “జై హింద్” అని నినదించారు.

 

వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే నేవీలో చేరారు. కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ”వినయ్ నర్వాల్ కి దేశభక్తి ఎక్కువ. దేశానికి సేవ చేయాలని బాల్యం నుంచి చెప్పేవాడు. సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి సెలెక్ట్ అయ్యాడు. సెకండ్ లెఫ్టినెంట్ గా నేవీలో చేరాడు. 18 నెలల్లోనే లెఫ్టినెంట్ గా ప్రమోషన్ కూడా పొందాడు” అని వినయ్ నర్వాల్ తాతయ్య గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతం అయ్యారు.