జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన వేళ గతంలో ఇండియాలో జరిగిన ఉగ్రదాడులు కూడా ప్రస్తావనకు వచ్చాయి. కశ్మీర్‌లోని పుల్వామాలో 2019లో ఉగ్రదాడి జరిగింది. దీంతో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి చెందారు.
దీనిపై పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తమ దేశ తీరును ఒక్కసారిగా బయటపెట్టారు. పుల్వామా దాడి వెనుక పాక్ హస్తం ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.
Also Read: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు షురూ.. అందాలతో అలరించిన సుందరీమణులు
పాకిస్థాన్ గగనతలంతో పాటు భూభాగం, సముద్ర సరిహద్దులకు, తమ దేశ ప్రజలకు ప్రమాదం తలెత్తుతుంటే, ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు తాము రాజీలేకుండా పోరాడతామని చెప్పుకొచ్చారు. అటువంటి వాటిని పట్టించుకోకుండా కూర్చోబోమని అన్నారు.
పాకిస్థాన్ ప్రజల ప్రతిష్ఠ మొత్తం దళాల్లోనే కలిసి ఉంందని, దీంతో తాము ఎల్లప్పుడూ దీన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. కశ్మీర్‌లోని పుల్వామాలో తమ ఎత్తుగడలను చూపించామని అన్నారు. తమ వ్యూహాలను ఇప్పటికే ప్రదర్శించినట్లు చెప్పారు.
దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ తీరును స్పష్టం చేస్తున్నాయి. పుల్వామా జరిగిన ఉగ్ర దాడితో తమకు సంబంధం లేదని అప్పట్లో పాక్ చెప్పుకొచ్చింది. భారత్‌పై ఉగ్రవాదులతో దాడులు చేయిస్తూ తమకు ఏం సంబంధం లేదని చెప్పుకుంటున్న పాకిస్థాన్ తీరు ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది.