Parliament Budget Session
Parliament Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. బుధవారం ఉదయం 11గంటలకు నిర్మలా సీతారామన్ దిగువ సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గురువారం ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత బడ్జెట్ పై పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది.
Telangana Govt Invited Governor : బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం
పార్లమెంట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. నేటి నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు మొదటి విడత జరుగుతాయి. మార్చి 13 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు రెండో విడత పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 36 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇదిలాఉంటే సమావేశాలు సజావుగా జరిగేందుకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి పహ్లాద్ జోషీ డిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, చైనా చొరబాట్లు, ఓబీసీ కుల గణన, అదానీ వ్యాపారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై పార్టీలు చర్చకు అడిగాయని, పార్లమెంట్లో ఏ అంశంపైన అయిన చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఇదిలాఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్యాంటీన్ లో ప్రత్యేక వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా తృణధాన్యాలతో చేసిన పలు ఆహార పదార్థాలు మెనూలో చేర్చారు. ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ క్రమంలో పార్లమెంట్ క్వాంటీన్ మెనూలో జొన్న ఉప్మా, రాగి దోశ, రాగి రవ్వ, రాగి ఇండ్లీ, సజ్జల కిచిడీ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చనున్నారు.