PETA Ad Controversy: కుక్క పాలు తాగుతున్న మహిళ.. పెటా యాడ్‌పై రచ్చరచ్చ.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..

పెటా ఏం చెప్పాలని అనుకుందో, దాని ఉద్దేశ్యం ఏంటో తెలియదు కానీ.. అది రూపొందించిన యాడ్ మాత్రం వివాదానికి దారితీసింది.

PETA Ad Controversy: పెటా (People for Ethical Treatment of Animals-PETA) చేసిన పనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. శాకాహారాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక ప్రకటన వివాదానికి దారితీసింది. ప్రపంచ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెటా చేసిన ప్రచారం, ఆ యాడ్ లోని చిత్రాలు కలవర పెట్టేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ యాడ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ ప్రకటనలో ఒక స్త్రీ కుక్క పాలు తాగుతున్నట్లు ఉంది. ఇక దానిపై “మీరు కుక్క పాలు తాగకపోతే, వేరే జాతుల పాలు ఎందుకు తాగుతారు? దయచేసి. వీగన్ ప్రయత్నించండి” అనే కోట్ కూడా ఉంది. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, ముంబై, నోయిడా వంటి అనేక ప్రధాన నగరాల్లో ఈ యాడ్ ను ప్రదర్శనకు ఉంచారు.

“పాల ఉత్పత్తి క్రూరత్వంలో పాతుకుపోయింది. బలవంతంగా గర్భధారణ చేయడం నుండి దూడలను వాటి తల్లుల నుండి హృదయ విదారకంగా వేరు చేయడం వరకు. ఆవులు పాలు ఇచ్చే యంత్రాలు కావు. వాటి పాలు దూడల కోసమే, మానవుల కోసం కాదు” అని పెటా రాసుకొచ్చింది.

పెటా ఏం చెప్పాలని అనుకుందో, దాని ఉద్దేశ్యం ఏంటో తెలియదు కానీ.. అది రూపొందించిన యాడ్ మాత్రం వివాదానికి దారితీసింది. ఈ యాడ్ చాలా మందికి నచ్చలేదు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ యాడ్ చాలా దారుణంగా ఉందంటున్నారు. పెటా తీరుని తప్పుబడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. “PETA ప్రచార బృందంలో ఉన్నవారు శాశ్వతంగా లాగ్ ఆఫ్ అవ్వాలి” అని ఒక నెటిజన్ అన్నాడు. “తెలివితక్కువ కంటెంట్”, “అసహ్యకరమైనది” అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ సందేశాన్ని భిన్నంగా తెలియజేయవచ్చు. ఇది పూర్తిగా లక్ష్యాన్ని కోల్పోతుంది” అని మరొక నెటిజన్ అన్నాడు.

Also Read: బంగారం తాకట్టు పెట్టే వారికి బిగ్ అలర్ట్.. RBI కొత్త రూల్స్.. ఇక నుంచి..

కొందరు నెటిజన్లు పెటా యాడ్ ను సమర్ధించే ప్రయత్నం చేశారు. “వాస్తవికత అదే. అందుకే కలవరపెడుతోంది. కుక్క, ఆవు, గేదె వంటి ఏ జంతువు నుండైనా పాలు తాగడం కూడా అంతే వింత. పెటా మనల్ని ఆగి ఆలోచించమని అడుగుతోంది” అని ఒక నెటిజన్ అన్నాడు. మొత్తంగా పెటా యాడ్ విస్తృత చర్చకు దారితీసింది.