Pil Filed In Supreme Court Seeking Probe Into Pegasus Spying
Pegasus Snooping PIL : పెగాసస్ స్పైవేర్ నిఘా ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. NSO గ్రూప్ కంపెనీ క్లయింట్లు దాదాపు 50 వేల ఫోన్ నంబర్లను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని సుప్రీంకోర్టుకు దాఖలైన పిటిషన్ పేర్కొంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని కోరింది. జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయ నేతలు, ఇతరులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని పిటిషన్‌లో తెలిపారు. లాయర్ ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో పెగాసస్ కుంభకోణం చాలా తీవ్రమైనదిగా పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఈ పిటిషన్ కోరింది. ఈ కుంభకోణంలో నిందితులందరినీ శిక్షించాలని కోరింది. పెగాసస్ స్పైవేర్‌ను కొనడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరింది. అంతేకాదు.. భారత న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం, దేశ భద్రతలపై ఇదో తీవ్రమైన దాడిగా పేర్కొన్నారు. నిఘాను యథేచ్ఛగా, జవాబుదారీతనం లేకుండా వినియోగించడమనేది నైతికంగా సరైనదికాదని ఆరోపించారు. వ్యక్తిగత గోప్యత అనేది వారి వ్యక్తిగత పరిధికి సంబంధించినదిగా తెలిపారు.
పెగాసస్ స్పైవేర్ వల్ల ఒక వ్యక్తి సంభాషణలను చాటుగా వినే అవకాశం ఉంటుంది. సదరు వ్యక్తి యావత్తు జీవితానికి సంబంధించిన డిజిటల్ ఇంప్రింట్‌ను కూడా తెలుసుకునేందుకు కూడా వాడొచ్చునని చెప్పారు. ఫోన్ వాడే వ్యక్తి గురించి మాత్రమే కాదు. సదరు వ్యక్తి కాంటాక్ట్‌లో ఉండేవారందరి గురించి తెలుసుకోనే అవకాశం ఉందని తెలిపారు. పెగాసస్ అనేది కేవలం నిఘా సాధనం మాత్రమే కాదని, ఇది సైబర్ ఆయుధమని పేర్కొంది.