సిజేరియన్ డెలివరీలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణంగా గతంలో కాన్పు సమయంలో ప్రమాదం తలెత్తితే తల్లీబిడ్డను కాపాడేందుకు అప్పటికప్పుడు సీ-సెక్షన్ (సిజేరియన్ డెలివరీ) చేసేవారు. అయితే, ఇటువంటి ఆపరేషన్‌తో పోల్చిచూస్తే ముందస్తుగా ఒక తేదీలో శిశువును కనాలని ప్లాన్‌చేసుకుని ఆ ఆపరేషన్ చేయించిన సందర్భాల్లో పుట్టిన పిల్లలకు లుకేమియా (రక్త క్యాన్సర్) వచ్చే ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
ప్రస్తుత కాలంలో చాలా మంది మంచిరోజు చూసుకుని లేదంటే తమకు వీలున్నప్పుడు డెలివరీ తేదీని ప్లాన్ చేసుకుని కాన్పునకు వెళ్తున్నారు. ఇటువంటి డెలివరీలపై కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం జరిపారు. ఇటువంటి ఆపరేషన్ ద్వారా పుట్టిన పిల్లలు భవిష్యత్తులో లుకేమియా వచ్చే అవకాశలు అధికంగా ఉంటాయని తేల్చారు.
Also Read: 2025లో టాప్ 5 బెస్ట్ 108MP కెమెరా ఫోన్లు ఇవే.. తీస్తే వీటితోనే ఫొటోలు తియ్యాలి భయ్యా..
ఇందుకు సంబంధించిన వివరాలను ‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురించారు. ఈ పరిశోధనలో భాగంగా స్వీడన్‌లో మెడికల్ బర్త్ రిజిస్ట్రర్ గణాంకాలను స్వీకరించారు. 1982–89, 1999–2015ల్లో పుట్టిన 25 లక్షల మంది చిన్నారుల ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. వారిలో 3.75 లక్షల మంది (15.5 శాతం) సిజేరియన్ ద్వారా పుట్టారు.
వారిలో 1,495 మందికి లుకేమియా వచ్చింది. సాధారణ డెలివరీతో పోలిస్తే ప్లాన్డ్ సిజేరియన్తో బిడ్డకు లుకేమియా ముప్పు 21 శాతం ఎక్కువ ఉంది. అలాగే, ఆస్తమా, టైప్ 1 డయాబెటిస్ ప్రమాదం కూడా ఉంటుంది.
సాధారణ డెలివరీ వేళ నొప్పుల కారణంగా లోపల ఉన్న శిశువు కూడా ఒత్తిడికి గురువుతుంది. దీంతో తల్లి వెజీనాలోని పలు రకాల బ్యాక్టీరియాకు ఎక్స్‌పోజ్ అవుతుంది. ప్లాన్డ్ సిజేరియన్ చేసేటపుడు ఇది జరగదు. దీంతో ప్లాన్డ్ సిజేరియన్ ద్వారా జన్మించిన శిశువు భవిష్యత్తులో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా బారిన పడే ముప్పు మిగతా పిల్లలతో పోలిస్తే 21% ఎక్కువ.