మందిరానికి ముందడుగు : రామమందిరం నిర్మాణంపై ప్రధాని మోడీ కీలక ప్రకటన

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి

  • Publish Date - February 5, 2020 / 06:48 AM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి

అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా మరో అడుగు పడింది.  రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి 05,2020) లోక్ సభలో మాట్లాడిన ప్రధాని.. ట్రస్ట్ ఏర్పాటు గురించి మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేశామన్నారు. మందిర నిర్మాణం, అభివృద్ధిపై ట్రస్ట్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని ప్రకటించారు.

మన సంస్కృతి, సంప్రదాయాలను ట్రస్ట్ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ట్రస్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రామమందిర ప్రాంతం కోసం 67 హెక్టార్ల భూమిని ట్రస్ట్‌కు అప్పగిస్తున్నామని తెలిపారు. రామమందిరం నిర్మాణానికి అందరూ సహకరించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 5 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని వెల్లడించారు.

అయోధ్యలోని వివాదాస్పద భూమి రామజన్మ స్థలమే అని సుప్రీంకోర్టు 2019 నవంబర్‌లో తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ మందిర నిర్మాణానికి వీలుగా మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ట్రస్ట్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోగా… ఇందుకు సంబంధించి పార్లమెంటులో ప్రధాని మోడీ అధికారిక ప్రకటన చేశారు.

మంత్రివర్గ సమావేశం నుంచి నేరుగా లోక్ సభకు వచ్చిన ప్రధాని మోడీ.. ప్రశ్నోత్తరాలకు ముందు ఈ ప్రకటన చేశారు. బుధవారం(ఫిబ్రవరి 05,2020) ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో అయోధ్య అంశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారని ప్రధాని అన్నారు. ఇందుకు 130కోట్ల మంది భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

అదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై ప్రధాని మోడీ పరోక్షంగా స్పందించారు. భారత్ లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బుద్ధులు, పార్శీ, జైన్.. ఇలా అందరూ ఒకే కుటుంబమని చెప్పారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరగాల్సిందేనని చెప్పారు. ప్రతి పౌరుడి ఆనందం కోసం సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ విధానంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రామ మందిరం నిర్మాణం గురించి ప్రధాని మోడీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఓటర్లను ప్రభావితం చేసేలా.. రామ మందిరంపై ప్రధాని మోడీ ప్రకటన చేశారనే అభిప్రాయం వినిపిస్తోంది.