Pm Modi
PM Modi Arrives In Glasgow : ప్రధాని మోదీ ఇటలీ పర్యటన ముగించుకొని గ్లాస్గోకు చేరుకున్నారు. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం, మంగళవారం జరిగే ప్రపంచ నేతల సదస్సులో ప్రధాని మోదీ సహా 120కిపైగా దేశాల ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు పాల్గొంటారు. సోమవారం సాయంత్రం కాప్26 సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఇందులో ఆయన భారత కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నారు. వాతావరణ కార్యాచరణలో మన విజయాలను ఈ సదస్సులో వివరించనున్నారు. కాప్26 సదస్సు నేపథ్యంలో ఆంటార్కిటికాలోని ఓ హిమానీ నదానికి గ్లాస్గో అని పేరుపెట్టారు. 2023 జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Read More : Telangana : కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం, ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోని వివిధ దేశాలను అనుసంధానిస్తూ కొత్తగా గ్రీన్ గ్రిడ్స్ ఇనీషియేటివ్‌ను భారత్, బ్రిటన్‌లు మంగళవారం ప్రారంభించనున్నాయి. సౌర విద్యుత్ బదిలీకి ఇది వీలు కల్పిస్తుందని అంతర్జాతీయ సౌర కూటమి డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ ధరలు తగ్గుతాయన్నారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. నవంబరు 12 వరకూ జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్‌లోని గ్లాస్గో నగరం వేదికైంది. దాదాపు 200 దేశాల నేతలు, ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. వాతావరణ మార్పులను అదుపు చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.