Pm Modi
PM Modi: పార్టీ బలోపేతం దిశగా కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ చర్చించారు. కార్పొరేటర్లను ఒకొక్కరిగా పరిచయం చేసుకున్న ప్రధాని ప్రశాంతంగా చర్చించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 47మంది కార్పొరేటర్లు తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒక్కో కార్పొరేటర్‌తో మాట్లాడిన మోదీ.. వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు గంట పాటు కొనసాగిన సమావేశం అనంతరం అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు కూడా.
సుదీర్ఘంగా ముచ్చటించిన మోదీ.. ప్రజా జీవితంలో ఆదర్శవంతంగా ఉండాలని, కష్టపడి పని చేస్తే అధికారం మనదే అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానిని కలిసేందుకు 47మంది కార్పొరేటర్లతోపాటు, 31 మంది గ్రేటర్ లీడర్లకు అపాయింట్మెంట్ దొరికింది.
Read Also: మోదీతో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ
ప్రధాని భేటీతో బీజేపీ గ్రేటర్ నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు నూతనోత్సాహంలో మునిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ.. శభాష్ బండి సంజయ్ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. హైదరాబాదులో పార్టీ పరిస్థితిపై కార్పొరేటర్ల నుంచి ప్రధాని మోదీ ఆరా తీశారు.
పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్లలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు గెలిచిన వారెంతమంది ఉన్నారని ప్రధాని అడిగారు.
సాదాసీదాగా పని చేస్తే సరిపోదని మనస్ఫూర్తిగా పార్టీ కోసం పని చేయాలని ప్రధాని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామంటూ కార్పొరేటర్లలో నరేంద్రమోదీ ఉత్సాహం నింపారు.
ప్రధానిని కలిసిన వారిలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, డాక్టర్ లక్ష్మణ్, మురళీధర్ రావు, రాజా సింగ్, రామచంద్ర రెడ్డి, రామచంద్ర రావు, గ్రేటర్ పరిధిలోని బిజెపి ఆరు జిల్లాల అధ్యక్షులు, గ్రేటర్ పరిధిలో నివాసముంటున్న రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారు.