రేపు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తున్నా : మోడీ

రెండు రోజుల పర్యటనకు గాను శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్తున్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Pm Modi Tour

PM Modi రెండు రోజుల పర్యటనకు గాను శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్తున్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు తాను మార్చి 26-27 తేదీల్లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కొవిడ్-19 కల్లోలం తర్వాత తన తొలి విదేశీపర్యటన ఇదేననీ.. అందునా ఇంతకాలం తరువాత తాను పొరుగు దేశానికి వెళ్తుండడం పట్ల తనకు సంతోషంగా ఉందని మోడీ అన్నారు. ఈ దేశంతో మన దేశానికి సాంస్కృతిక, భాషా పరమైన సుదీర్ఘ స్నేహ సంబంధాలు ఉన్నాయని మోడీ అన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్‌ రెహ్మాన్‌ శతజయంతి వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. గత శతాబ్దంలో ఆయన ఓ మహోన్నత నేతగా కొనియాడారు. ముజిబుర్‌ ఆలోచనలు, జీవితం కోట్లాది మందికి ప్రేరణగా నిలిచాయని గుర్తుచేసుకున్నారు. తుంగైపరలోని బంగబంధు ముజిబుర్‌ సమాధిని సందర్శించి నివాళులర్పిస్తానని తెలిపారు.

బంగ్లాదేశ్ అభివృధ్డికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా చేస్తున్న కృషిని మోడీ ప్రశంసించారు. ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ సాధించిన అభివృద్ధి, ఆర్థిక ప్రగతిని ప్రశంసించడానికి మాత్రమే నా పర్యటన పరిమితం కాదు.. కానీ ఈ విజయాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నాను అని ప్రధాని పేర్కొన్నారు. తన పర్యటనలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌, బంగ్లాదేశ్ ప్రముఖలతో కూడా తాను భేటీ కానున్నట్టు మోదీ తెలిపారు. తన పర్యటన వల్ల ఉభయ దేశాల మధ్య అన్ని రంగాల్లో సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, రక్షణ, భద్రత, సంస్కృతి, కనెక్టివిటీ మరియు ఇన్‌ఫ్రా వంటి అంశాల్లో సహకారం వంటి తదితర విషయాలు ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా చర్చకు రానున్నాయి.