చౌకీదార్ చోర్ హై అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొడుతూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించింది.2014 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చాయ్ వాలా అని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బీజేపీ తన ప్రచార అస్త్రాలుగా మార్చుకొని చాయ్ పే చర్చా పేరుతో ప్రచారం చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో కూడా అదే తరహా ప్రచారానికి బీజేపీ తెరదీసింది.
ప్రధాని మోడీ అనేకసందర్భాల్లో తనను తాను చౌకీదార్ గా చెప్పుకున్నారు. అయితే రాఫెల్ డీల్ విషయంలో మోడీ అవినీతికి పాల్పడ్డాడని,చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు) అంటూ కాంగ్రెస్ సహా పలు రాజకీయపార్టీలు మోడీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో ప్రధాని మోడీ మై భీ చౌకీదార్ పేరుతో ఉద్యమం ప్రారంభించారు.దేశంలోని అవినీతి, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు తనలాగే ఎంతోమంది పోరాడుతున్నారని, ఈ లక్ష్య సాధనలో తాను ఒంటరివాడిని కాదని మోడీ తెలిపారు.
దేశ ప్రగతి కోసం శ్రమించే వారందరూ చౌకీదారులే అన్నారు.నేనూ కాపలాదారునే అంటూ ప్రతిజ్ఞ చేయాలని తన మద్దతుదారులకు శనివారం ట్విటర్ ద్వారా ప్రధాని పిలుపునిచ్చారు. ఆదివారం తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ పేరును కూడా చౌకీదార్ నరేంద్రమోడీగా మార్చారు.పలువురు బీజేపీ నాయకులు కూడా మోడీనే అనుసరిస్తూ తమ ట్విట్టర్ ఖాతా పేర్లకు ముందు చౌకీదార్ అనే పదాన్ని జత చేశారు.చౌకీదార్ అమిత్ షా,చౌకీదార్ పియూష్ గోయల్,చౌకీదార్ జేపీ నడ్డాలు గా మార్చుకున్నారు.మై భీ చౌకీదార్’పేరుతో ట్విటర్‌లో ఇప్పటికే ఒక హ్యాష్ ట్యాగ్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.