Delhi blast
PM Narendra Modi : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. తొమ్మిది నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతికాగా.. 24 మందికి గాయాలయ్యాయి. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు చేరింది. బాంబు దాడి ఘటనతో దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. భూటాన్ రాజధాని థింపులో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుపై ఘటన గురించి ప్రస్తావించారు. ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. భయంకరమైన సంఘటన అందరినీ బాధపెట్టింది. చాలా బాధాకరమైన హృదయంతో భూటాన్ కు వచ్చాను. బాధిత కుటుంబాల బాధను నేను అర్ధం చేసుకున్నాను. ఈ రోజు మొత్తం దేశం వారితో నిలుస్తుందని మోదీ తెలిపారు.
ఢిల్లీ పేలుడు ఘటనపై దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. దర్యాప్తు సంస్థలతోపాటు ముఖ్యమైన వ్యక్తులతో నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. దాడికి గల కారణాలను త్వరలోనే అధికారులు వెల్లడించనున్నారని పేర్కొన్నారు. ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.
Speaking in Thimphu, Bhutan. Watch. https://t.co/nLu0f5q5WY
— Narendra Modi (@narendramodi) November 11, 2025