PM Narendra Modi
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (ఆదివారం) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5గంటలకు మోదీ మాట్లాడనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో కీలక మార్పులు చేసింది. స్లాబులను నాలుగు నుంచి రెండు స్లాబులకు కుదించింది. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి (22వ తేదీ) అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సామాన్య, మధ్య తరగతి వర్గాలపై మోదీ వరాల వర్షం కురిపిస్తారని తెలుస్తోంది.
PM @narendramodi will be addressing the nation at 5 PM this evening.
— PMO India (@PMOIndia) September 21, 2025
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలపై ఉండే అవకాశం ఉంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం తగ్గిస్తూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులకు బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5శాతం కాగా.. రెండోది 18శాతం. మోదీ తన ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణల వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించే అవకాశం ఉంది. అదనంగా మరికొన్ని హామీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దేశంపై టారిఫ్ ల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే భారత్ నుంచి ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై 50శాతం టారిఫ్ లు విధించడంతో ఆయా రంగాలు కుదేలవుతున్నాయి. మరోవైపు.. తాజాగా.. హెచ్1బీ వీసా దారులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవటం భారతదేశానికి పెద్దదెబ్బ అని చెప్పొచ్చు. ఈ చర్య వల్ల అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్నీషియన్లలో ఎక్కువ భాగం ప్రభావితం చేస్తుంది. ఈ అంశాలపైనా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ గత 11ఏళ్ల కాలంలో పలు సార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో కీలక ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించారు. 8 నవంబర్ 2016న మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో రూ.500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత భారత సైన్యం ప్రారంభించిన బాలకోట్ వైమానిక దాడుల గురించి 12మార్చి 2019న ప్రకటించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
24 మార్చి 2020న కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సమయంలోనూ ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
లాక్‌డౌన్ పొడిగింపును ప్రకటిస్తూ 14ఏప్రిల్ 2020న మోదీ మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మే నెలలో, ప్రభుత్వం లాడౌన్‌ను సడలించాలని నిర్ణయించిందని ఆయన దేశానికి చెప్పారు.
పహల్గామ్‌లో ఉగ్రదాడి తరువాత భారత సైన్యం చేపట్టిన ప్రతిదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి వివరాలు తెలియజేస్తూ ఈ ఏడాది మే 12న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.