Bat Chicken: ఫాస్ట్ ఫుడ్, మాంసాహార ప్రియులారా.. జరభద్రం.. మీరు లొట్టలేసుకుంటూ తింటున్నది చిల్లీ చికెన్ కాకపోవచ్చు. అది బ్యాట్ చికెన్ కావొచ్చు. ఏంటి ఫ్యూజులు ఎగిరిపోయాయి కదూ. అవును నిజమే.. మీరు తింటున్నది గబ్బిలాల మాంసం కావొచ్చు. ఒళ్లంతా చెమట్లు పట్టించే ఈ దారుణ దందా బయటపడింది.
చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని హోటల్స్ కు సప్లయ్ చేస్తున్న ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని హోటల్స్ కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చేరవేస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు సేలం జిల్లా ధనిష్ పెట్టై అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని పోలీసులు విచారించగా షాకింగ్ నిజం బయటపడింది. గబ్బిలాల మాంసం దందా వెలుగులోకి వచ్చింది.
ఆ ఇద్దరు గబ్బిలాలను వేటాడుతున్నారు. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరుతో హోటల్స్ కు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లయ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. కొన్ని హోటల్స్ కు చిల్లీ చికెన్ తదితర ఐటెమ్స్ పేరుతో స్వయంగా గబ్బిలాల మాంసంతో వండించి చేరవేస్తున్నారని తేలింది. కొన్నేళ్లుగా ఇలాగే జరుగుతోందని వారు బాంబు పేల్చారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు.
”తోప్పూర్ రామసామి అటవీ పరిధిలో అనేకసార్లు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దాంతో అటవీ అధికారులను అప్రమత్తం చేశాం. సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని పెట్రోలింగ్ బృందం ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో అడవిలో తుపాకులతో తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించాము. కమల్, సెల్వం ను అదుపులోకి తీసుకున్నాం. వారిద్దరూ గబ్బిలాలను వేటాడి చంపేవారు. వాటిని తినడానికి సిద్ధం చేస్తారు. ఆ మాంసాన్ని కోడి మాంసం అని చెప్పి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా విక్రయించే వారు” అని అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని విక్రయించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారం చికెన్ ప్రియులను ఉలిక్కిపడేలా చేసింది. ఇన్నాళ్లూ తాము తిన్నది చికెనో లేక గబ్బిలాల మాంసమో తెలియక ఆందోళన చెందుతున్నారు. తమ ఆరోగ్య పరిస్థితి గురించి వారు టెన్షన్ పడుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయోనని కంగారు పడుతున్నారు. ఈ ఘటనతో బయట చికెన్ తినాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అది చికెనో లేక గబ్బిలాల మాంసమో అనే అనుమానం వారిని వేధిస్తోంది. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని విక్రయించిన ముఠా సభ్యులను అత్యంత కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.