Srushti Test Tube Center Case: వెలుగులోకి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు..ఐవీఎఫ్‌కు 200మంది రిజిస్ట్రేషన్లు.. ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్న దంపతులు..
కూకట్ పల్లి, కొండాపూర్ లోనూ సృష్టి బ్రాంచ్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Srushti Test Tube Center Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలపై దర్యాఫ్తు కొనసాగుతోంది. సృష్టి ఆసుపత్రిలో పోలీసులు భారీగా ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐవీఎఫ్ కు సుమారు 200మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఫైల్స్ ను వెరిఫై చేస్తున్నారు. ఇక గతంలో పిల్లలను పొందిన దంపతుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. సృష్టి వ్యవహారంపై బయటకు రావడంతో కొందరు దంపతులు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నట్లు సమాచారం. కూకట్ పల్లి, కొండాపూర్ లోనూ సృష్టి బ్రాంచ్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సంతాన సాఫల్యం కోసం ఆశ్రయించిన వారిని నిలువుదోపిడీ చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ గోపాలపురం పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ బ్రాంచ్ లో అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. డాక్టర్ నమత్రతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లో సృష్టికి ఎన్ని బ్రాంచ్ లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు సంతానం పొందారు? అనే కీలక వివరాలు రాబట్టే పనిలో గోపాలపురం పోలీసులు ఉన్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని కేవలం సికింద్రాబాద్ లోనే కాకుండా కొండాపూర్, కూకల్ పల్లి ప్రాంతాల్లోనూ సృష్టికి బ్రాంచ్ లు ఉన్నట్లు కనుగొన్నారు. నగరంలో వేర్వేరు పేర్లతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. సుమారు 200 మంది సంతానం కోసం సృష్టిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి పేర్లతో పాటు సంతానం పొందిన వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
200 మందికి సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఐవీఎఫ్ తో పాటు సరోగసి ద్వారా పిల్లలను పొందిన దంపతుల వివరాలను కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు. వాటి ఆధారంగా వారిని సంప్రదించే ప్రయత్నం చేయగా పోలీసులకు షాక్ తగిలింది. ఈ వ్యవహారం బయటకు రాగానే చాలా మంది దంపతులు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసేసుకున్నారు.