Prakash Raj: సుదీప్ నిర్ణయంపై ప్రకాశ్ రాజ్ విస్మయం.. హర్ట్ అయ్యాడట

కన్నడ అగ్ర కథానాయకుడు సుదీప్ రాజకీయ నిర్ణయంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు.

Sudeep, Prakash (Pic: FB)

Prakash Raj: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (kichcha sudeep) మద్దతు ప్రకటించడంపై బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్న సుదీప్ నిర్ణయం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. సుదీప్ నిర్ణయంతో షాక్ తిన్నానని, బాధ కలిగిందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ గురువారం వెల్లడించింది.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని, ఆయన ఏ పార్టీలో ఉన్నా పార్టీలకతీతంగా తాను మద్దతుగా నిలుస్తానని సుదీప్ ప్రకటించారు. బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) సూచించిన వారందరీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని వెల్లడించారు.

ఆ ప్రచారం ఫేక్..
కాగా, బీజేపీలో సుదీప్ చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను అంతకుముందు ప్రకాశ్ రాజ్(prakash raj) తోసిపుచ్చారు. కర్ణాటకలో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి ఫేస్ వార్తలను ప్రచారం చేస్తోందని.. సుదీప్ లాంటి తెలివైనవాళ్లు బీజేపీ వలలో పడబోరని వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్.. 2019 లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీ విధానాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తోన్న ఆయన తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) విధానాలపై గళమెత్తుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కర్ణాటకలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్ని వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీనిలో భాగంగా సెలబ్రిటీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్సిస్తున్నాయి. జనాకర్షణ కలిగిన వారితో ప్రచారం చేయించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (karnataka assembly elections) పోలింగ్ మే 10న జరగనుంది. మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Also Read: బీజేపీకి ప్రచారం చేయనున్న కన్నడ కింగ్ కిచ్చా సుదీప్.. పార్టీలో చేరికపై ఏమన్నారంటే?