Prashant kishor
PK: దేశంలో రాజకీయ వ్యూహకర్తగా రాణించి, ప్రస్తుతం బిహార్ లో సామాజిక కార్యకర్తగా పాదయాత్ర చేస్తోన్న ప్రశాంత్ కిశోర్ కు గాయమైంది. దీంతో ఆయన బిహార్ (Bihar) లో జన సురాజ్ (Jan Suraaj) పాదయాత్రకు నెల రోజులు దూరంగా ఉండనున్నారు.
ప్రశాంత్ కిశోర్ కండరాలకు గాయమైంది. సమస్తిపూర్ లో ప్రశాంత్ కిశోర్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. జన సురాజ్ పాదయాత్ర తర్వాత ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? అన్న విషయంపై స్పష్టత లేదు.
“నాకు ఇతర ఏ ఆరోగ్య సమస్యలూ లేవు. చాలా దూరం నడవడం, ఇక్కడి రోడ్లు బాగోలేకపోవడం వల్లే నా కండరాలకు గాయమైంది” అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. బిహార్ లోని మారుమూల ప్రాంతాలల్లోనూ పర్యటించాలని తాను అనుకుంటున్నానని చెప్పారు. అందుకు మరిన్ని నెలల సమయం పడుతుందని వివరించారు. పాదయాత్రను పూర్తి చేయడానికి వైద్య ప్రక్రియ పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు.
ప్రశాంత్ కిశోర్ జేడీయూకి రాజీనామా చేశాక సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన రాజకీయ వ్యూహకర్త బాధ్యతలకు కూడా దూరంగా ఉంటున్నారు. పాదయాత్ర పూర్తయ్యాక సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది.