Price Hike Alert : ధరలు మండుతున్నాయ్..! ఇంకా అయిపోలేదు.. అసలు కథ ముందుంది.. రెడీ అవ్వండి

Price Hike Alert: అంతర్జాతీయంగా యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, ఎల్‌నినో ప్రభావం కారణంగా దేశంలోని నిత్యావసర వస్తువుల ధరల నుంచి ఫోన్లు, వాహన ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Price Hike Alert

Price Hike Alert in India : పేద, మధ్య తరగతి ప్రజల జీవనం రోజురోజుకు భారంగా మారుతోంది.. క్రమంగా పెరుగుతున్న ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ భారంతో ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతుంటే.. నిత్యావసర ధరల పెరుగుదల కూడా తలకు మించిన భారంగా మారుతోంది.. ఇది చాలదన్నట్లుగా.. స్మార్ట్ ఫోన్ల ధరలు మరింత ప్రియంగా మారుతున్నాయి.. అయితే.. రానున్న కాలంలో ధరల భారం మరింత ఎక్కువ కానున్నట్లు తెలుస్తోంది.. ఎల్‌నినో ప్రభావంతో ఆప్పటికే పంటల సాగు తగ్గుతుండగా.. రాబోయే రోజుల్లో కూరగాయల నుంచి నిత్యావసర సరుకుల వరకు ధరలు మరింత మండిపోతాయని మార్కెటల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read : Smartphone Prices Hike : కొత్త ఫోన్ కొనేదెట్టా.. మండిపోతున్న మొబైల్ ధరలు.. ఏయే బ్రాండ్ ఫోన్లు ఎంత పెరిగాయంటే?

అంతర్జాతీయంగా యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు దేశంలోని ముడిచమురు సరఫరా, ధరలపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చమురు ధరలు పెరగడంతో రవాణా వ్యయం పెరిగింది. రవాణా ఖర్చులు పెరగడంతో దాని ప్రభావం కూరగాయలు, ఆహార పదార్థాలు, పారిశ్రామిక ఉత్పత్తులు సహా అనేక రంగాలపై పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచగా.. సెప్టెంబర్ త్రైమాసికంలోనూ ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, గోద్రెజ్‌ వంటి కంపెనీలు.. ఇప్పటికే జూన్‌ త్రైమాసికంలో కొన్ని ఉత్పత్తుల గ్రామేజ్‌ బరువు తగ్గించగా, మరికొన్ని ఉత్పత్తుల ధరలను పెంచాయి. అంతర్జాతీయంగా ఇంకా అనిశ్చితి కొనసాగుతుండడంతో ప్రస్తుత త్రైమాసికంలోనూ ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ధరల పెంపు చేపట్టేందుకు రెడీ అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోయాయి. దీంతో పంటల సాగు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో కూరగాయల నుంచి పప్పు ధాన్యాల పంటల సాగు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఉత్పత్తి తగ్గి ధరల భారం మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే కంపెనీలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతుండగా.. త్వరలోనే ఈ పెంపు చూడొచ్చునని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు ధరలను నేరుగా పెంచకుండా వస్తువుల పరిమాణాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ధనిక వర్గాలతో పాటు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లోసైతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. ప్రస్తుతం వాటి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రముఖ మొబైల్ కంపెనీలు మెమోరీ చిప్ ల ధరలు పెరగడంతో తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఫోన్ల ధరలను పెంచేస్తున్నాయి. శాంసంగ్ కంపెనీ తన ఎస్25 సిరీస్ ధరలను రూ.12వేల వరకు పెంచింది. వివో ఇటీవల వై సిరీస్ ధరలను రూ.4వేలు పెంచింది. తాజా టీ సిరీస్ స్మార్ట్ ఫోన్ ధరలను ఏకంగా రూ.7వేల వరకు పెంపు చేపట్టింది. ఇలా దాదాపు అన్ని కంపెనీలు ఫోన్ల ధరలను పెంచేస్తుండటంతో మధ్య తరగతి వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే.. రాబోయే రోజుల్లో అన్ని ఫోన్ల ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు కార్ల ధరలుసైతం పెరుగుతున్నాయి. పెరుగుతున్న ముడిసరుకు, వస్తువుల ధరలు, అధిక నిర్వహణ ఖర్చులు, నిరంతర భౌగోళిక రాజకీయ, స్థూల ఆర్థిక అనిశ్చితుల కారణంగా కంపెనీలు తమతమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి హ్యుందాయ్ వాహనాల ధరలు ఒకశాతం మేరకు పెరగనున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి కూడా తన ఎరీనా, నెక్సా శ్రేణి ధరలను పెంచేసింది. ఇలా నిత్యావసర వస్తువుల ధరల నుంచి ఫోన్లు, కార్లు.. అన్ని రంగాలకు చెందిన ఉత్పత్తుల ధరలు రానున్నన రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని, అసలు కథ ముందుంది అంటూ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.