Putin Bulletproof Car : పుతిన్ కారు ‘కదిలే కోట’! బుల్లెట్ ప్రూఫ్ నుంచి బాంబ్ రక్షణ వరకు.. ఇందులో ఏముందంటే? ‘ఆరస్ సెనాట్’ పూర్తి కథ ఇదే!
Putin Bulletproof Car : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో అడుగు పెట్టారు. దీంతో ఆయన వినియోగించే ‘ఆరస్ సెనాట్’ కారు గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది.
Putin Bulletproof Car
Putin Bulletproof Car : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో అడుగు పెట్టారు. ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీలో అడుగుపెట్టారు. బ్రిక్స్ సదస్సుకోసం ఢిల్లీకి వచ్చిన పుతిన్ వెంట భారీ భద్రతా కాన్వాయ్ కూడా వచ్చింది. అయితే, ఇందులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది మాత్రం ఆయన ప్రత్యేకంగా ఉపయోగించే ‘ఆరస్ సెనాట్’ కారు. ఇది బుల్లెట్ ప్రూఫ్, పేలుడు నిరోధక లగ్జరీ లిమోసిన్ కారు. బయటకు చూస్తే విలాసవంతమైన కారు మాదిరిగా కనిపించినా.. భద్రత పరంగా ఇది ఒక కదిలే కోటలా రూపొందించారు. దీని ధర సుమారు 18 మిలియన్ రూబుల్స్ (రూ.2.5 కోట్లు). గతంలో ప్రధాని మోదీ కూడా చైనాలో పుతిన్‌తో కలిసి ఈ కారులో ప్రయాణించారు.
పుతిన్ కోసం ప్రత్యేకంగా..
ప్రపంచంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత పొందే దేశాధినేతల్లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఒకరు. విదేశీ పర్యటనల్లో కూడా ఆయన సాధారణంగా స్థానికంగా అందుబాటులో ఉన్న వాహనాలపై పూర్తిగా ఆధారపడకుండా.. తన ప్రత్యేక అధ్యక్ష వాహనాన్ని వెంట తీసుకెళ్తారు. ఇందులో ప్రధానమైనది.. ఆరస్ సెనాట్ లగ్జరీ ఆర్మర్డ్ లిమోసిన్. ఆరస్ సెనాట్ లిమోసిన్ కారును రష్యాకు చెందిన ‘ఆరస్ మోటార్స్’ సంస్థ తయారు చేసింది. దీనిని ‘ఫోర్జెస్ ఆన్ వీల్స్ (చక్రాలపై కవచం కలిగిన కోట)’ అని పిలుస్తారు. ఈ కారు తయారీలో రష్యా ప్రభుత్వ సంస్థతో పాటు యూఏఈ సంస్థ కూడా భాగస్వామిగా ఉంది. సోవియట్ కాలంకు చెందిన కార్ల స్ఫూర్తితో 2018 లో ఔరస్ సెనాట్ కారును రూపొందించారు. దీని సాధారణ వెర్షన్ కూడా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంది.
అత్యున్నత భద్రతా ప్రమాణాలతో..
పుతిన్ వాడే కారు మాత్రం అత్యున్నత భద్రతా ప్రమాణాలతో పూర్తి సాయుధ వాహనంగా ఉంటుంది. ఈ కారు పొడవు సుమారు 5.63 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు, ఎత్తు 1.7 మీటర్లు. వీల్‌బేస్ సుమారు 3.3 మీటర్లు. గరిష్ఠ వేగం సుమారు 160 కిలోమీటర్లు. ఇది దాదాపు 9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. భద్రత మాత్రమే కాదు.. పనితీరులోనూ ‘ఆరస్ సెనాట్’ శక్తివంతమైన వాహనం. ఇందులో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ వ్యవస్థ ఉంటుంది. ఇది సుమారు 598 హార్స్పవర్, 880 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తొమ్మిది స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా శక్తి చక్రాలకు చేరుతుంది.
పుతిన్ కారు.. కదిలే కోటలా!
పుతిన్ ఉపయోగించే ఆరస్ సెనాట్ సాధారణ లగ్జరీ లిమోసిన్ కాదు. భారీ ఆర్మర్ రక్షణతో రూపొందించిన ఈ వాహనం బుల్లెట్లు, పేలుళ్ల వంటి తీవ్రమైన భద్రతా ముప్పులను ఎదుర్కొనేలా రూపొందించబడింది. అందుకే దీనిని అంతర్జాతీయంగా ‘Fortress on Wheels’ అని పిలుస్తుంటారు. అయితే, ఈ కారుకు సంబంధించిన అనేక భద్రతా వివరాలు రహస్యంగానే ఉంటాయి. మరోవైపు.. బయట నుంచి చూస్తే భారీ భద్రతా వాహనంలా కనిపించే ఈ లిమోసిన్‌లో పుతిన్ కోసం విలాసవంతమైన ఇంటీరియర్ కూడా ఉంటుంది. లెదర్, వుడ్ ట్రిమ్, ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలు వంటి సదుపాయాలు ఉన్నాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా పనిచేసేలా వాహనాన్ని రూపొందించారు. అంటే ఒకవైపు అత్యంత కఠినమైన రక్షణ, మరోవైపు అత్యున్నత స్థాయి సౌకర్యాలు.. రెండింటినీ ఒకే వాహనంలో కలపడం ఆరస్ సెనాట్ ప్రత్యేకత.
