Copper Price : కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న కాపర్.. భవిష్యత్ బంగారం ఇదేనా? రాగిలో పెట్టుబడి ఎలా.. సురక్షితమేనా?
Copper Price : ఈ ఏడాది బంగారం, వెండిలాంటి లోహాల ధరల్లో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాపర్ మాత్రం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ప్రస్తుతం కాపర్ ధరలు వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
Copper Price
Copper Price : విలువైన లోహాలు అనగానే.. గుర్తుకు వచ్చేది బంగారం, వెండి. పెట్టుబడిదారులు కూడా ఆ రెండు లోహాల మీద ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఐతే ఇప్పుడు బంగారం, వెండి కాదు.. కాపర్ కొత్త బంగారంగా కనిపిస్తోంది. రాగికి డిమాండ్ భారీగా పెరగడంతో.. దాని ధర కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది.
బంగారం ధర గతేడాది ఏకంగా 70శాతం మేర పెరిగింది. వెండి ధర 150శాతం వరకు పుంజుకుంది. ఇతర లోహాలు అల్యూమినియం, పల్లాడియం, ప్లాటినమ్, కాపర్ వంటివి కూడా గత ఏడాది దూసుకుపోయాయి. అయితే, ఈ ఏడాది మాత్రం బంగారం, వెండిలాంటి లోహాల ధరల్లో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాపర్ మాత్రం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ప్రస్తుతం కాపర్ ధరలు వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో కాపర్ ధర ఏకంగా 50శాతం పెరిగింది. ఇదే ఇప్పుడు మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారింది.
లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో రాగి టన్నుకు 14వేల 737 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది భారత కరెన్సీలో సుమారుగా 14 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా రాగి తవ్వకం, శుద్ధి సామర్థ్యాల మధ్య పెరుగుతున్న అసమతుల్యత వల్ల.. సరఫరా ఒతిళ్లు పెరిగి, రాగి ధరలు రికార్డు స్థాయికి చేరాయని నిపుణులు అంటున్నారు. ఇక అటు అమెరికా దిగుమతి సుంకాల చుట్టూ నెలకొన్న అనిశ్చితి కూడా రాగి ధర పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. శుద్ధి చేసిన రాగి దిగుమతులపై అమెరికా ప్రభుత్వం సుంకాలు విధించే అవకాశం ఉందని.. కొంతకాలంగా మార్కెట్ అంచనా వేస్తోంది. ఒకవేళ ఈ సుంకాలు అమలు జరిగితే.. అమెరికాలో రాగి ధరలు మరింత పెరుగుతాయి. దీంతో సుంకాలు విధించకముందే వ్యాపారులు పెద్ద మొత్తంలో రాగిని అమెరికాకు రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీనికి తగినట్లు ఉత్పత్తి లేకపోవడంతో.. రాగి ధరలకు రెక్కలు వస్తున్నాయి.
కాపర్‌కు కేవలం మార్కెట్ అంచనాల కారణంగానే డిమాండ్ పెరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా దీని అవసరం వేగంగా పెరుగుతోంది. రాగి అనేది సాధారణ పారిశ్రామిక లోహం మాత్రమే కాదు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్లు, డేటా సెంటర్లు.. ఏఐ మౌలిక సదుపాయాల్లాంటి రంగాలలో కాపర్‌కు మంచి డిమాండ్ ఉంది. విద్యుత్ కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు.. ఎలక్ట్రిక్ వాహనాలలో కూడా రాగిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రపంచ దేశాలన్నీ గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీంతో కాపర్ అవసరం మరింత పెరుగుతోంది. అయితే, పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లు.. సరఫరా పెరగడం కష్టంగా మారుతోంది. ఇక ఏఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. డేటా సెంటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనికి కూడా పెద్ద పవర్.. కేబులింగ్ వ్యవస్థలు అవసరం. దీంతో భవిష్యత్తులో రాగికి డిమాండ్ మరింత వేగంగా పెరుగుతుందని అంచనా. దీనికి పారిశ్రామిక డిమాండ్ కీలకంగా పరిగణిస్తున్నారు.
ఆఫ్రికాలోని కొన్ని పెద్ద కాపర్ గనుల్లో ప్రమాదాలు, ఉత్పత్తి అంతరాయాలు చోటుచేసుకోవడంతో ప్రపంచ మార్కెట్లో సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో కాపర్ ధరలకు మరింత మద్దతు లభిస్తోంది.ఈ మధ్య అమెరికా డాలర్ విలువ పడిపోవడం కూడా కాపర్ ధరలకు కలిసొచ్చింది. డాలర్ కాకుండా ఇతర కరెన్సీలు కలిగి ఉన్న కొనుగోలుదారులకు కాపర్ కొంత చౌకగా మారింది. ఇక రాగిని పెట్టుబడి అవకాశంగా చూసేవారు కేవలం ధరల పెరుగుదలను మాత్రమే కాకుండా.. మార్కెట్ పరిస్థితులు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి లక్ష్యాల్లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం, వెండి ధరలతో పోటీ పడుతూ.. గ్లోబల్ మార్కెట్లో రాగి హవా ఏమాత్రం తగ్గడం లేదు. కాపర్‌కు ఈ స్థాయి రేటు రావడానికి తాత్కాలిక కారణాలు గట్టిగానే పనిచేస్తున్నాయి. రిఫైన్డ్ మెటల్ దిగుమతులపై కూడా ట్రంప్ సర్కార్ పన్నులు పెంచుతుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో లాభాలు పిండుకోవాలని భావించిన గ్లోబల్ ట్రేడర్లు.. కొన్ని లక్షల టన్నుల రాగిని అమెరికాకు తరలించేశారు. దీంతో ప్రపంచదేశాల్లోని నిల్వలు తగ్గిపోయి.. ఒక్క అమెరికాలోనే కాపర్ కుప్పలుగా పేరుకుపోయింది. దీంతో ఇది అసలైన డిమాండ్ కారణంగా పెరిగిన ధర కాదు.. కేవలం టారిఫ్ భయాలతో ఒకే చోటికి సరుకు తరలించడం వల్ల వచ్చిన తాత్కాలిక షార్టేజ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ధరలు పెరిగితే పారిశ్రామిక రంగానికి భారం అవుతుంది. కానీ, రాగి గనుల వ్యాపారం చేసే కంపెనీలకు మాత్రం ఇది పెద్ద పండగలా మారింది. రియో టింటో, బీహెచ్పీ, గ్లెన్‌కోర్, జీజీన్ మైనింగ్‌లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు కాపర్ బిజినెస్ ద్వారా ఊహించని రీతిలో లాభాలను మూటగట్టుకున్నాయ్. ప్రపంచంలోనే అత్యధికంగా రాగిని ఉత్పత్తి చేసే చిలీలో.. ఉత్పత్తి పడిపోయింది. ఆగస్టులో చిలీ రాగి ఎగుమతులు భారీగా క్షీణించాయ్. రాబోయే రోజుల్లో ఏమైనా పుంజుకుంటే తప్ప.. 2017 తర్వాత గనుల నుంచి రాగి ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి అవుతుంది. ఒకవైపు సరఫరా తగ్గి, మరోవైపు గ్లోబల్ డిమాండ్ పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో రాగి ధరలు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రాగి కొరత తీవ్రరూపం దాల్చింది. ఈ భారీ ప్రవాహాల కారణంగా లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ గిడ్డంగుల్లోని నిల్వలు దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. ఇక అటు ప్రపంచంలోనే అతిపెద్ద రాగి వినియోగ దేశంగా ఉన్న చైనాలోనూ పరిస్థితులు మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంత మందగమనం కనిపించినప్పటికీ.. చైనా తయారీ రంగం ఇప్పుడు తన సంప్రదాయ గరిష్ట ఉత్పత్తి సీజన్లోకి ప్రవేశిస్తుండటంతో దేశీయంగా డిమాండ్ వేగంగా పుంజుకుంటోంది. కొత్త రాగి గనులు అభివృద్ధి కావాలంటే 7 నుంచి 12 ఏళ్లు పడుతుంది. మాములు అనుమతులు, పర్యావరణ అనుమతులు, భూసేకరణలాంటి అంశాలు ఈ ప్రక్రియను మరింత స్లో చేస్తాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్, విండ్ ఎనర్జీ, గ్రిడ్ అప్‌గ్రేడ్స్, బ్యాటరీ స్టోరేజ్, ఏఐ డేటా సెంటర్లు రాగి డిమాండ్‌ను పెంచుతున్నాయి. దీంతో రాగి అనేది మరో బంగారంగా మారుతోంది.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాగి ధర త్వరలోనే 20వేల డాలర్ల మైలురాయిని అందుకోవడం, సమీపంలోకి వెళ్లడం పెద్ద మ్యాటర్ కాదు అనేది మరికొందరి అంచనా. ధరలు పెరుగుతుండడంతో.. రాగిలో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి 3 దారులు ఉంటాయ్. ఒకటి కాపర్ స్టాక్స్. రెండు.. కమొడిటీ ట్రేడింగ్. మూడోది.. ఫిజికల్ కాపర్ బార్స్. ఐతే భౌతికంగా కొనుగోలు చేసి రాగిని దాచడం కంటే డిజిటల్ లేదా ఈక్విటీ మార్గాల ద్వారా పెట్టుబడి పెట్టడం కాస్త ఈజీ.. ఇంకా ఇక్కడ వేగంగా ఆ పెట్టుబడిని నగదుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుందంటున్నారు నిపుణులు.
