Ayodhya Ram Mandi : అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. ప్రధాని చేతులమీదుగా కొలువుదీరిన బాలరాముడు

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు.

Ayodhya

Ayodhya : అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వందల ఏళ్లనాటి కల సాకారం అయింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడిలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారు. అభిజిత్ లగ్నంలో ఈ మహోన్నత కార్యక్రమం పూర్తయింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పులకించిపోయింది. మధ్యాహ్నం 12.29నిమిషాల 8సెకన్ల నుంచి ముఖ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు.. 84 సెకన్లపాటు క్రతువును పూర్తి చేశారు. అనంతరం బాలరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ తొలిపూజ చేసి.. బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.

Also Read : Ayodha Ram Mandir photos : అయోధ్య రామమందిరం ఫొటోలు.. ప్రారంభోత్సవానికి ముందు ముస్తాబైన ఆలయం.. ఎంత అందంగా ఉందో..

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాన క్రతువు ప్రారంభమైన సమయం నుంచి హెలికాప్టర్ల ద్వారా అయోధ్య రామాలయంపై పూల వర్షం కురిసింది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు సమయంలో దేశం మొత్తం రామనామ స్మరణతో మారుమోగిపోయింది. టీవీల ముందు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రజలు పులకించిపోయారు. బాల రాముడి తొలి చిత్రాన్ని చూసి భక్తిపారవశ్యంలో పరవశించిపోయారు. స్వర్ణాభరణాలతో బాలరాముడు ధగధగా మెరుస్తూ దర్శనమిచ్చారు. కుడిచేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లుతో అభయమిచ్చారు.

 

  • రేపటి నుంచి సాధారణ భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవచ్చు.
  • 24 అడుగుల దూరం నుంచి బాలరాముని దర్శనం చేసుకోవచ్చు.
  • దర్శన సమయాలను రెండు స్లాట్లుగా విభజన చేశారు.
  • ఉదయం 7గంటల నుంచి 11:30 గంటల వరకు.. అదేవిధంగా మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బాలరాముని దర్శనం చేసుకోవచ్చు.
  • ప్రతిరోజూ బాలరామునికి మూడు సార్లు హారతులు ఇస్తారు.
  • ప్రతీరోజూ ఉదయం 6.30 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు