Petrol Price Reduced : వాహనదారులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణమిదే!
Petrol Price Reduced : ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3కు తగ్గించింది.
Petrol Price Reduced
- వాహనదారులకు శుభవార్త
- పెట్రోల్, డీజిల్ ధర తగ్గింది
- పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.3కు తగ్గించిన నయారా ఎనర్జీ
Petrol Price Reduced : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి అనుగుణంగా ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3కు తగ్గించింది. రెండేళ్లకుపైగా కాలంలో రిటైల్ ఇంధన ధరలను ఏ కంపెనీ అయినా తగ్గించడం ఇదే తొలిసారి.
ఫశ్చిమాసియాలో ఘర్షణలు సద్దుమణిగిన తరువాత హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. దీంతో ముడి చమురు, ధ్రవీకృత సహజ వాయువుల సరఫరా పునరుద్దరించబడింది. దీంతో సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే ఈ ధరల తగ్గింపు జరిగింది.
దేశవ్యాప్తంగా నయారాకు సంబంధించి 7వేలకుపైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుతం సవరించిన ధరలు ఈ బంకుల్లో తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వంటి స్థానిక సుంకాలను బట్టి రాష్ట్రాల వారీగా వాస్తవ ధరలు మారుతూ ఉంటాయని తెలిపారు.
మరోవైపు.. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ధరలను యథాతథంగా ఉంచారు. భారతదేశంలో లక్షకుపైగా ఇంధన కేంద్రాల్లో 90శాతానికిపైగా వాటాను కలిగిఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఎటువంటి సవరణను ప్రకటించలేదు.
ఇరాన్ సంఘర్షణ చెలరేగి అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన తర్వాత, ఇంధన ధరలను పెంచిన తొలి రిటైలర్లలో నయారా ఒకటి. మార్చి 26న ఇది పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 పెంచింది. ఆ తరువాత ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు కూడా అనుసరించారు. ప్రస్తుతం నయారా సంస్థ గతంలో పెంచిన ధరలను తగ్గించింది.
