Priyanka Gandhi: వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక భారీ రోడ్ షో.. బహిరంగ సభలో ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు.

priyanka gandhi

Priyanka Gandhi Nomination: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇండియా కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడారు. గత 35ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించా.. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. తొలిసారి నా కోసం నేను ప్రచారం చేసుకుంటున్నానని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Also Read: Priyanka Gandhi: వయనాడ్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి..

సత్యం, అహింస, ప్రేమ, ఐక్యత కోసం భారతదేశం అంతటా ఎనిమిది వేల కిలో మీటర్లు నడిచేలా నా సోదరుడు రాహుల్ గాంధీని కదిలించారు.. ప్రపంచం మొత్తం నా అన్నకు ఎదురు తిరిగినప్పుడు మీరు అతనితో నిలబడ్డారని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రియాంక గాంధీ అన్నారు. పోరాడుతూనే ఉండేలా బలాన్ని, ధైర్యాన్ని అందించారు. నా కుటుంబం మొత్తం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. నేను మీకు, రాహుల్ గాంధీకి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ నాకు వివరించారు. మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించగలమో ఆ విధంగా చర్యలు తీసుకుంటానని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.